ఇందిరమ్మ ఇళ్లకు దళారుల బెడద.. అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు
బోథ్, నవంబర్ 28 (విజయక్రాంతి): నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకానికి దళారుల బెడద ఎదురవుతోంది. ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పేదల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం అధికార పార్టీ (Ruling Party) వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి కొందరు స్థానిక నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జిల్లా అధ్యక్షుడు జాదవ్ నరేష్ తెలిపారు. ఈ వ్యవహారంపై పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించారు. మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, పార్టీ పరంగా సస్పెన్షన్‌తో పాటు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందాలని జాదవ్ నరేష్ స్పష్టం చేశారు. పథకాలు మంజూరు చేయిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని కోరారు.