ఆరోగ్యం, విద్య, భద్రతపై ఆదివాసీ గ్రామాల్లో పోలీసుల అవగాహన..
- చెరువుగూడ గ్రామంలో పోలీసు మీకోసం కార్యక్రమం..
- 6 గ్రామాల ప్రజలకు..
- 6 విభాగాల వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరం
- మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి..
- ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించాలి...
- గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..
- చదువు ఒక్కటే భవిష్యత్తును మార్చే ఆయుధం
- – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఉట్నూర్, నవంబర్ 03 (విజయక్రాంతి): ఆదివాసీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంతో పాటు, ప్రజల్లో అవగాహన పెంపొందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో చెరువుగూడ గ్రామంలో పోలీసు మీకోసం(Police Me Kosam Program) కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6 గ్రామాల ప్రజలకు 6 విభాగాలకు చెందిన వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది గ్రామ ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు, బాబాలను నమ్మకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు చేయడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.
యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉన్నప్పుడే గ్రామాల్లో ప్రశాంతత, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బాలబాలికలకు సమాన విద్యా అవకాశాలు కల్పించి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాలని, చదువు ఒక్కటే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
మహిళలు, విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసు అక్క లేదా డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని, సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. తల్లిదండ్రులు బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని, బాల్యవివాహాల సమాచారం తెలిసిన విద్యార్థినులు పోలీసులకు నిర్భయంగా సమాచారం అందించాలని తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, విద్యార్థులు తమ తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు విభాగాలకు చెందిన వైద్య నిపుణులచే ఉచిత వైద్య సేవలు అందించారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఆదిలాబాద్లో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి, అనంతరం తమ వాహనాల్లో గ్రామానికి తిరిగి చేరవేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, గ్రామ ప్రజలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఎస్ఐ జి. విజయ్, ఆదిలాబాద్ నుండి వచ్చిన వైద్యులు డాక్టర్ సందీప్ ఐత్వార్, డాక్టర్ టి. వెంకటేష్, డాక్టర్ ఇందూజ, డాక్టర్ శ్వేత, డాక్టర్ సౌమ్య, డాక్టర్ సాగ్నిక్, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ భగవంతరావు, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.