ఆదిలాబాద్ లో మనీలాండరింగ్ కేసు కలకలం

28-11-2026 | 08:24pm

ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ మిట్టల్ అరెస్ట్...

ఆదిలాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు(Bank accounts) తెరిచి, ఫోర్జరీ, చీటింగ్‌కు(Forgery, cheating) పాల్పడిన ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ మిట్టల్(Prominent businessman Rajiv Mittal) (గోర సెట్) ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పరిశ్రమల్లో  పని చేసే కార్మికుల ఆధార్, పాన్ కార్డులు(Workers' Aadhaar and PAN cards) తీసుకుని వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయల లావాదేవీలు కొనసాగించినట్లు రాజీవ్ మిట్టల్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆదాయపు పన్ను ఎగవేతకు బినామీ ఖాతాలను వినియోగించి ప్రభుత్వాన్ని, కార్మికులను మోసం చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు.

శనివారం రాజీవ్ మిట్టల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని, ఆయన సోదరుడు సంజీవ్ కుమార్ మిట్టల్ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు తమ వ్యాపార సంస్థల ఆర్థిక లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా ఉంచి, పన్ను ఎగవేయాలనే ఉద్దేశంతో తమ వద్ద పనిచేసే కార్మికులైన పెర్క భూమన్న, అలువాల అనిల్ కుమార్ సుధాకర్, మాదస్తువార్ సంతోష్, రమాకాంత్ కేంద్రే, గోదం గజానన్ తదితరులను నమ్మించి వారి ఆధార్, పాన్ కార్డులు సేకరించారు.

వారి సంతకాలను ఖాళీ కాగితాలపై తీసుకుని శ్రీ రేణుకా మాత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్‌లో వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచారన్నారు. అనంతరం ఖాతాదారుల చెక్‌బుక్‌లను తీసుకుని ఖాళీ చెక్కులపై వారి సంతకాలు సేకరించి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. సదరు బినామీ ఖాతాల ద్వారా తమ వ్యాపార సంస్థలకు సంబంధించిన కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తూ ఆదాయపు పన్ను శాఖకు ఆర్థిక లావాదేవీల వివరాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

పెర్క భూమన్న పేరుతో నిర్వహించిన బ్యాంకు ఖాతాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.5,16,41,322, 2014-15లో రూ.1,94,27,504 లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా పలువురు కార్మికుల ఖాతాల ద్వారా 2012-13 నుంచి 2015-16 వరకు మొత్తం సుమారు రూ.8.55 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వెల్లడైందన్నారు.

మరిన్ని వార్తలు