ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
వెంకటాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని, వారి హక్కుల సాధన కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక ములుగు జిల్లా అధ్యక్షుడు రేండ్ల సంతోష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన ఐక్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లిన అనేక మంది ఉద్యమకారులు నేడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'బ్రతికుండి తెలంగాణ సాధించుకుందాం' నినాదం స్ఫూర్తితో 'బ్రతికుండి ఉద్యమకారుల హక్కులు సాధించుకుందాం' అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మలిదశ ఉద్యమకారుడు సాంబయ్య ను ములుగు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రఘు, రాజు, నాగరాజు, పాషా తదితరులు పాల్గొన్నారు.