అభివృద్ధికి రూ.1,000 కోట్లతో పనులు
భవిష్యత్తు అవసరాల కోసం మరో రూ.1,200 కోట్ల ప్రతిపాదనలు
తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు గడువులోగా పూర్తి చేయాలి
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి) : నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) తెలిపారు. గత మూడేళ్లలో సుమారు రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్తులో మహబూబ్‌నగర్(Mahabubnagar), జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలను ట్రై సిటీగా అభివృద్ధి చేసేందుకు మరో రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలో రూ.220 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, రూ.603 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.100 కోట్లతో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి, రూ.267 కోట్లతో అమృత్ 2.0 కింద మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి 7 నుంచి 10 రోజులకు పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు. నగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందించేందుకు 18 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే 13 రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
సుమారు 70 ఏళ్ల తర్వాత నగరంలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవకాశం వచ్చిందని, ఈ ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మారుస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.