దొడ్డిదారిన గద్దెనెక్కేందుకే డీలిమిటేషన్
- దక్షిణాది గొంతు నొక్కేందుకే సీట్ల కుదింపు కుట్ర.
- సర్ ప్రక్రియతో 13 కోట్ల ఓట్ల తొలగింపు దుర్మార్గం.
- డిసెంబర్ 1 నుంచి జైల్ భరో ఉద్యమం.
- గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి.
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
కొత్తగూడెం: టౌన్ నవంబర్ 28 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం(Central Government) అత్యుత్సాహంతో చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన(Delimitation of Constituencies) (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Koonamneni Sambasiva Rao) మండిపడ్డారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(CPI Bhadradri Kothagudem District) కార్యవర్గ సమావేశం శనివారం పాల్వంచలోని పార్టీ కార్యాలయం 'సిఆర్ భవన్'లో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి, సీట్ల తగ్గింపు పేరుతో శిక్షించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోని సీట్లను పెంచుకుని, దొడ్డిదారిన మళ్లీ గద్దెనెక్కేందుకే బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని విమర్శించారు. దేశ సమగ్రతను దెబ్బతీసే ఈ ఏకపక్ష డీలిమిటేషన్ ప్రక్రియను దక్షిణాది ప్రజలంతా ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్లకు పైగా అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ధ్వజమెత్తారు. బీజేపీకి అనుకూలంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేసే ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులకు నిరసనగా 'మార్పు అవసరం' (బద్లావ్ జరూరీ హై) నినాదంతో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్త జైల్ భరో ఆందోళనను విజయవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ గ్రామస్థాయి నుంచి సిపిఐని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ ఉద్యమాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ జిల్లాలో జైలు భరో కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
డిసెంబర్ 1న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి, 2న భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం ముట్టడి, 3న మణుగూరులో నిరసన ద్వారా జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. డిసెంబర్ చివరి వారంలో ఖమ్మంలో జరిగే మహిళా సమాఖ్య(NFIW) రాష్ట్ర మహాసభలు, జనవరి చివరి వారంలో భద్రాచలం కేంద్రంగా జరగనున్న అఖిల భారత ఆదివాసీ మహాసభల జయప్రదం కోసం విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
ఉప్పుశెట్టి రాహుల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, SD సలీం, k సారయ్య, సలిగంటి శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, మున్నా లక్ష్మీకుమారి, మూడ్ గణేష్, కంచర్ల జమలయ్య, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జి వీరస్వామి, భూక్య దాసురు, కందుల భాస్కర్, SK ఫహీం తదితరులు పాల్గొన్నారు.