భేధొడా గ్రామాన్ని సందర్శించిన వ్యవసాయ విద్యార్థులు

07-11-2026 | 07:57pm

బెల,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana Agricultural University), ఆదిలాబాద్‌కు చెందిన విద్యార్థులు(Students ) సహభాగిత గ్రామీణ అంచనా (PRA – Participatory Rural Appraisal) కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని భేధొడా గ్రామాన్ని సందర్శించి రైతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ముందుగా బాజీరావ్ బాబా కమ్యూనిటీ హాల్‌లో రైతులతో సమావేశమై కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. గ్రామీణ ప్రజలు, రైతుల భాగస్వామ్యంతో గ్రామంలోని సమస్యలు, అందుబాటులో ఉన్న వనరులు, అవసరాలు, వ్యవసాయ(Agricultur) పరిస్థితులను క్షేత్రస్థాయిలో గుర్తించి అంచనా వేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, ఉపసర్పంచ్ సురేందర్, ఉపాధ్యాయుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు మధుకర్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ విద్యార్థులు, అధ్యాపకులను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

విద్యార్థులు రైతులతో ముఖాముఖి మాట్లాడి గ్రామంలో సాగు చేస్తున్న పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, పంట కాలం, నీటి వనరులు, ఎరువులు, పురుగుమందుల వినియోగం, పంటల యాజమాన్య పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల సాగులో వస్తున్న ఇబ్బందులు, దిగుబడి పెంచేందుకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.

అనంతరం గ్రామంలోని పత్తి, శనగ పంట పొలాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించారు. రైతులు అనుసరిస్తున్న సాగు పద్ధతులను తెలుసుకుంటూ, పంటల యాజమాన్యంపై రైతుల సందేహాలను అడిగి తెలుసుకున్నారు. పుస్తకాల్లో నేర్చుకున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం విద్యార్థులకు లభించింది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యార్థులకు తరగతి గదిలో నేర్చుకునే సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో రైతులు అనుసరిస్తున్న సాగు విధానాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. PRA కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశమన్నారు. రైతుల అనుభవాలు, విద్యార్థుల శాస్త్రీయ పరిజ్ఞానం పరస్పరం పంచుకోవడం వల్ల వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

మరిన్ని వార్తలు