బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలపై అవగాహన ఉండాలి
ములకలపల్లి,నవంబర్ 14( విజయక్రాంతి): బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా మూకమామిడి గ్రామ పంచాయతీ(Mookamamidi Grama Panchayat) కార్యాలయంలో శనివారం బాలల గ్రామసభ ఘనంగా నిర్వహించడం జరిగింది.దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ(Chacha Nehru) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఈ కార్యక్రమంలో పిల్లలను ఉద్దేశించి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో గ్రామ స్వరాజ్య సాధనలో పిల్లల భాగస్వామ్యం ఎంతో అవసరం. మహాత్మా గాంధీ(Mahatma Gandhi) కలలుకన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే గ్రామ నిర్ణయాధికార ప్రక్రియలో సమాజంలోని అన్ని వర్గాలతో పాటు పిల్లల గళాన్ని కూడా వినడం అనివార్యం.
చిన్నారులకు బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలు(Democratic values), హక్కులు సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడానికి గ్రామ సభ ఒక అద్భుతమైన వేదిక.గ్రామంలో విద్యార్థుల విద్యావకాశాలు,ఆటస్థలాలు,రక్షిత తాగునీరు,అంగన్ వాడీ కేంద్రాల పనితీరు బాలల రక్షణ - బాల్య వివాహాల నివారణ,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు పిల్లల అభిప్రాయాలను సేకరించడం ఎంతో ముఖ్యం.
ప్రతి గ్రామ సభలో పిల్లలు పాల్గొనడం వల్ల వారిలో నాయకత్వ లక్షణాలు పెరగడమే కాకుండా, గ్రామంలోని అసలైన సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి వస్తాయి.రాబోయే గ్రామ సభలలో పిల్లలు చురుగ్గా పాల్గొనేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు చొరవ తీసుకుని ప్రోత్సహించాలి.ఈ రోజు మీదే పిల్లలూ.మీరు బాగా చదువుకోవాలి.చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం.మీలోనే రేపటి సర్పంచ్ లు,టీచర్లు,డాక్టర్లు, కలెక్టర్లు,ఇంజనీర్లు ఉన్నారు.
పంచాయతీ తరపున మీ చదువుకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.ఉపాధ్యాయులు బి.శ్రీను మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రమశిక్షణ,మంచి అలవాట్లు నేర్చుకోవాలి.పెద్దలను గౌరవించాలి,గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి.మీ కలలను నెరవేర్చుకోవడానికి ప్రతిరోజూ కష్టపడి చదవాలి అని పిల్లలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ దోమల అరుణ్, ఉపాధ్యాయులు బి శ్రీను,అంగన్ వాడీ టీచర్లు వేప విజయ, మడకం రాధ,సున్నం మహలక్ష్మి గ్రామస్తులు,చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.