PF ఖాతాదారులకు గుడ్ న్యూస్

14-11-2026 | 06:25pm

EPFO: ఉద్యోగం మారినా, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినా.. పీఎఫ్ (PF) ఖాతాలో ఉన్న డబ్బుపై వడ్డీ(Interest ) పొందే అవకాశం ఉందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organization) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్‌పై వడ్డీ ఆగిపోతుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ అర్హత కలిగిన ఖాతాలకు 58 ఏళ్ల వయసు వరకు వడ్డీ ప్రయోజనం కొనసాగుతుంది. దీంతో ఉద్యోగం మానేసినవారు తమ పీఎఫ్ మొత్తాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా? లేక ఖాతాలోనే ఉంచుకోవాలా? అనే విషయంపై అవగాహన కలిగి ఉండటం అవసరం.

ఉద్యోగం వదిలేస్తే PF డబ్బు ఏమవుతుంది?

ఉద్యోగి పనిచేస్తున్న సమయంలో ప్రతి నెలా వేతనం నుంచి నిర్ణీత మొత్తాన్ని పీఎఫ్ ఖాతా(PF Account)లో జమ చేస్తారు. యాజమాన్యం కూడా నిబంధనల ప్రకారం తన వాటాను అందిస్తుంది. ఇలా పోగైన మొత్తం ఉద్యోగి భవిష్యత్తుకు ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినా, ఉద్యోగ విరామం తీసుకున్నా అప్పటివరకు జమ చేసిన సొమ్ము వెంటనే రద్దు కాదు. అది పీఎఫ్ ఖాతాలోనే కొనసాగుతుంది.

58 ఏళ్ల వరకు వడ్డీ ఎందుకు?

సాధారణంగా 55 ఏళ్లలోపు ఉద్యోగాన్ని వదిలేసిన వ్యక్తి పీఎఫ్ ఖాతా వెంటనే ఇన్‌ఆపరేటివ్‌గా మారదు. EPF స్కీమ్ నిబంధనల(EPF Scheme Rules) ప్రకారం ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారే వరకు వడ్డీ ప్రయోజనం లభించవచ్చు. ముఖ్యంగా అర్హత కలిగిన ఖాతాలకు 58 ఏళ్ల వయసు వరకు వడ్డీ జమ అవుతుంది.

ఉదాహరణకు.. ఒక ఉద్యోగి 40 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదిలేశారనుకుందాం. అప్పటికి ఆయన పీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే, ఉద్యోగం మానేశారనే కారణంతో ఆ మొత్తంపై వడ్డీ వెంటనే నిలిచిపోదు. వర్తించే నిబంధనల ప్రకారం ఖాతా కొనసాగుతున్నంతకాలం వడ్డీ ప్రయోజనం పొందవచ్చు.

ఎప్పుడు వడ్డీ నిలిచిపోతుంది?

EPF నిబంధనల ప్రకారం నిర్దిష్ట పరిస్థితుల్లో ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది. 55 ఏళ్లు నిండిన తర్వాత లేదా ఉద్యోగ విరమణ తేదీ నుంచి, వర్తించే నిబంధనల ప్రకారం వరుసగా మూడేళ్లపాటు ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకపోతే ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణిస్తారు. అలాంటి ఖాతాకు ఆ తర్వాత వడ్డీ జమ కాదు. అందుకే ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనే తొందరపడకుండా ఖాతా స్థితి, వయసు, EPFO నిబంధనలను పరిశీలించాలి. అవసరమైతే EPFO అధికారిక పోర్టల్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు