ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

14-11-2026 | 06:12pm

వెంకటాపూర్, నవంబర్ 14 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో(Vedavyasa High School) బాలల దినోత్సవాన్ని(Childrens Day) పురస్కరించుకొని ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నుంచి శనివారం వరకు వ్యాసరచన, ఫ్యాన్సీ డ్రెస్, సంప్రదాయ దుస్తులు, చిత్రలేఖనం పోటీలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ, మాక్ అసెంబ్లీ కార్యక్రమాలు(Mock assembly activities) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విద్యార్థులు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకుల పాత్రలు పోషిస్తూ శాసనసభ సమావేశాన్ని తలపించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు తమ శాఖల బాధ్యతలను వివరించగా, ప్రతిపక్ష నాయకులు వివిధ సమస్యలపై ప్రశ్నలు సంధించారు. విద్యార్థులు ఇచ్చిన సమాధానాల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ(Democratic system), శాసనసభ పనితీరుపై అవగాహన పొందారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు పోషాల వీరమల్లు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతో పాటు నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సామాజిక స్పృహ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే పాఠశాల లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజయ్య, ఉపాధ్యాయులు రామచందర్, హనుమంతు, సమ్మయ్య, మాలతి, అక్షిత, అనూషతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు