యాసంగి పంటల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి
కోదాడ,(విజయక్రాంతి): ఎల్నినో(El Nino) ప్రభావంతో రానున్న యాసంగి కాలంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను బట్టి పంటల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సీహెచ్ నరేష్ సూచించారు. శనివారం కోదాడ మండలంలోని చిమిర్యాల గ్రామంలో వ్యవసాయ శాఖ, సూర్యాపేట ఆత్మ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ యాసంగి 2026 కార్యక్రమం('Khet Bachao Abhiyan Rabi 2026 Program)లో ఆయన మాట్లాడారు.
నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా పెసర, మినుము, బొబ్బర్లు, శనగ, వేరుశనగ వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోదాడ గ్రామీణ మండల వ్యవసాయ అధికారి రజినీ మాట్లాడుతూ, వరి పంటకు అధిక నీరు అవసరమవుతుందని, నీటి లభ్యత తక్కువగా ఉన్న చోట వరి వేస్తే పంట మధ్యలో నీటి కొరత ఏర్పడి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త సీహెచ్ నరేష్, కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజినీ, చిమిరియాల గ్రామ సర్పంచ్ గురవయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు మహేష్, ఝాన్సీలతో పాటు పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు.