యూరియా మోతాదుతో భూమికి విషం

12-11-2026 | 01:04pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సాగుభూమిని సంరక్షించడంతో పాటు భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉందని బూరుగూడ వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి అన్నారు. మోతుగూడలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ (Khet Bachao Abhiyan) కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు.

అధిక మోతాదులో రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియా వినియోగం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని తెలిపారు. సాధారణంగా లీటరు నీటిలో 45 మిల్లీగ్రాముల వరకు ఉండాల్సిన నైట్రేట్ స్థాయులు కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 650 మిల్లీగ్రాముల వరకు పెరుగుతున్నాయని వివరించారు.

కలుషితమైన నీటిని తాగడం, సాగుకు వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు (Health Risks) పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను (Organic Farming) అవలంబించాలని సూచించారు.

నేల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్ తరాలకు సారవంతమైన సాగుభూమిని అందించేలా రైతులు బాధ్యతగా వ్యవహరించాలని ముత్యం తిరుపతి కోరారు.

మరిన్ని వార్తలు