సండ్రలబోడులో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీలు!
పాఠశాలల్లో విద్యాబోధనపై ఆరా.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి
అశ్వాపురం, నవంబర్ 18 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు (Welfare Schemes) అర్హులైన పేదలకు అందుతున్నాయా లేదా అని పరిశీలించేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్(ITDA Project Officer B. Rahul ) బుధవారం అశ్వాపురం మండలం సండ్రలబోడు గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామంలో సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామపంచాయతీ పాలన, మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వీబీ రాంజీ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఎంపీపీ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. స్వయంగా ఉపాధ్యాయుడి పాత్ర పోషిస్తూ విద్యార్థులతో అక్షరాలు రాయించి, వాటి అర్థాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతిరోజూ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎంపీడీవో ముత్యాలరావు, పీఆర్ ఏఈ కిషోర్, గ్రామ సర్పంచ్ తెల్లం నాగమణి, వీఆర్వో లక్ష్మణరావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.