అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా

18-11-2026 | 03:45pm
  1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ప్రత్యేక కార్యాచరణ
  2. జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు

ఆసిఫాబాద్, నవంబర్ 18(విజయ క్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులు వర్తిస్తారని, లబ్ధిదారుల గుర్తింపునకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని వారి వివరాలను ఆధార్ ఆధారంగా సేకరించనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిలో గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హుల వివరాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు పత్రాలను, లబ్ధిదారుల సంతకాలతో సహా స్కాన్ చేసి సంబంధిత బీమా సంస్థకు పంపిస్తామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కుటుంబ పెద్ద వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు, బంధుత్వం, నామినీ వివరాలు తదితర సమాచారాన్ని తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని మారుమూల, గిరిజన గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారదర్శకంగా వివరాల సేకరణ, పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు