ఇల్లు మంజూరైనా.. స్థలం లేక ఇక్కట్లు!
తన సమస్యను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం: బాధితురాలు ఎర్రం శ్రీదేవి
అశ్వాపురం, నవంబర్ 18 (విజయక్రాంతి): ఆనందపురం గ్రామపంచాయతీ(Anandapuram Gram Panchayat) పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఉత్తర్వులు అందజేసిందని, అయితే ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన 400 చదరపు అడుగుల స్థలం లేకపోవడంతో నిర్మాణం చేపట్టలేకపోతున్నానని బాధితురాలు ఎర్రం శ్రీదేవి తెలిపారు.
తన కుటుంబ పరిస్థితులు, స్థల సమస్యను పూర్తిగా తెలుసుకోకుండా కొందరు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం తన సమస్యను ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆనందపురం గ్రామానికి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు కాట్రాజ్ కొండలరావు, దేవనపోయిన మహేష్ తన తమ్ముడు ఎర్రం కోటేష్ను ముందుపెట్టి,
మాజీ ఎమ్మెల్యే ఎదుట ఏడిస్తే డబ్బులు ఇప్పిస్తామని చెప్పినట్లు తన తమ్ముడి ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత సమస్యను రాజకీయాలకు ముడిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నాయకులపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని, తనకు ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం సమస్య ఉందన్న వాస్తవాన్ని గుర్తించి, తన ఇబ్బందిని రాజకీయ రాద్ధాంతం చేయవద్దని ఎర్రం శ్రీదేవి కోరారు.