సాకివాగులో ఘనంగా జనజాతీయ దివస్ వేడుకలు
ములకలపల్లి,నవంబర్ 9 (విజయక్రాంతి): ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా(Dharti Aaba Bhagwan Birsa Munda) 151వ జయంతి సందర్భంగా రాచన్నగూడెం గ్రామ పంచాయతీలో(Rachannagudem Gram Panchayat) సాకివాగు గ్రామంలో 15 రోజుల జనజాతీయ గౌరవ దివస్ పండుగ వేడుకలు ఆది, సోమవారాల్లో ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department, Government of Telangana), సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ - భద్రాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాచన్నగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలు,చిన్నారులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డోలు వాయిద్యాలు,గిరిజన సంప్రదాయ నృత్యాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమానికి రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ, మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ మాట్లాడుతూ బిర్సా ముండా గిరిజనుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు.ఆయన ఆశయాలను మన పిల్లలకు తెలియజేయాలనే ఈ 15 రోజుల పండుగ జరుపుకుంటున్నాం.
మన సంస్కృతిని,మన ఆచారాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు.మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ గిరిజన బిడ్డలు చదువులో అన్ని రంగాల్లో ముందుండాలి.ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి.బిర్సా ముండా స్ఫూర్తితో మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు.అనంతరం గిరిజన సంప్రదాయాలకు సర్పంచులు కళాకారులతో నృత్యాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.డోలు,తాళాలతో సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించి అందరిని అలరించారు.
చిన్నారులు సంప్రదాయ వేషధారణలో సందడి చేశారు.అనంతరం గ్రామాల పెద్ద మనుషులకు సర్పంచులు,సెక్రెటరీ పూల బొకేలతో,శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్,పంచాయతీ సెక్రెటరీ బిట్ట వెంకటేశ్వర్లు,గ్రామ పెద్దలు పద్దం లక్ష్మణరావు,మడివి సోనయ్య,మడకం రవి,కోవాడి రాజు తదితర గ్రామాల పెద్దలు,మహిళలు,యువకులు, అంగన్ వాడీ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.