ఎన్ఎల్ఎం పథకం అక్రమాలపై విచారణ జరపాలని పిర్యాదు
కొత్తపల్లి, నవంబర్ 09 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకం(National Livestock Mission Scheme) అమలులో జరిగినట్లు అనుమానిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ నిధులను కాపాడాలని కోరుతూ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(All India Forward Bloc) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బద్రినేత కలసి జిల్లా కలెక్టర్ కు సోమవారం రోజున ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎఐఎఫ్‌బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా అమలు చేస్తున్న ఎన్ఎల్ఎం పథకం కరీంనగర్ జిల్లాలో అక్రమాలకు వేదికగా మారుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
జిల్లాలో సుమారు 40 మంది లబ్ధిదారులకు గొర్రెలు, కోళ్ల పెంపకం ప్రాజెక్టుల కింద ఒక్కో ప్రాజెక్టుకు సుమారు రూ.కోటి వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించినట్లు తెలుస్తోందని తెలిపారు. ఇందులో రూ.50 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, రూ.40 లక్షల బ్యాంకు రుణం, రూ.10 లక్షల లబ్ధిదారుడి పెట్టుబడి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 98 శాతం మంది లబ్దిదారులు ప్రాజెక్టు రిపోర్ట్ కు అనుగుణంగా షెడ్ లు వేయలేదని, గోర్లు , మేకలు మరియు కోళ్లు లేకుండానే పాత్ర పశుసంవర్ధక శాఖ అధికారుల, బ్యాంక్ అధికారుల లబ్దిదారులతోకలసి పెద్ద ఎత్తున అవినీతికి పలుపడ్డారని అన్నారు. అవినీతికి పలుపడ్డ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆమోదించిన ప్రాజెక్టు నివేదికలకు అనుగుణంగా షెడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడం, పాత షెడ్లను కొత్త నిర్మాణాలుగా చూపించడం, క్షేత్రస్థాయిలో గొర్రెలు, కోళ్లు లేకున్నా ఉన్నట్లు చూపించడం, తప్పుడు ఫోటోలు, బిల్లులు, నివేదికలు సమర్పించినట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించి తమ వద్ద ప్రాజెక్టు రిపోర్టులు, షెడ్ల నిర్మాణాల వివరాలు, ఇతర పత్రాలు మరియు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.ఈ ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేసిన ఎస్బిఐ, యూనియన్ బ్యాంక్, కెడిసిసి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి
తదితర బ్యాంకుల అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల క్షేత్రస్థాయి తనిఖీలు, రుణాల విడుదల, బిల్లుల ధృవీకరణ ప్రక్రియలను పరిశీలించాలన్నారు.
అదేవిధంగా పశుసంవర్ధక శాఖ అధికారుల తనిఖీ నివేదికలు, ధృవీకరణలు, సబ్సిడీ విడుదలకు సంబంధించిన రికార్డులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్వతంత్ర విచారణ బృందాన్ని నియమించి, ప్రతి ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.