మొన్న ఎంపీడీవో.. నేడు పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
* ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ కమీషనర్ దివ్య
* ఈ నెల 5న ఎంపీడీవో, 9న పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
పాపన్నపేట,నవంబర్09: మండల పరిధిలోని డాక్య, రాజ్య, దంజా తండాల ఉపాధి పనుల్లో (వీబీజీ రామ్జీ)(VBG Ramji) 790 మంది గిరిజనుల పేర్లు గల్లంతు అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈనెల 5న పాపన్నపేట ఎంపీడీవో విష్ణువర్ధన్ సస్పెన్షన్(Suspension of Papannapet MPDO Vishnuvardhan) అయిన సంగతి విధితమే. ఇది ఇలా ఉండగా తాజాగా ఇదే విషయమై సోమవారం పంచాయతీ కార్యదర్శి ఇశ్రత్ బేగంను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమీషనర్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా తాండాలకు చెందిన 790 మంది గిరిజనుల పేర్లు జాబ్ కార్డుల నుంచి 2022లో తొలగించారు.
అప్పటినుంచి వీరికి ఉపాధి పనుల్లో పనిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. మా పేర్లు నమోదు చేయాలని బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై 2న జరిగిన ప్రజావాణిలో గ్రామ సర్పంచ్ స్వప్న హిరాలాల్ ఫిర్యాదు చేయడంతో స్పందించిన కమిషనర్ ఈనెల 5న ఎంపీడీవో విష్ణువర్ధన్ ను సస్పెండ్ చేశారు.
అనంతరం డిఆర్డీఓ, డిఆర్డిఏ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా గ్రామపంచాయతీ కార్యదర్శి ఇశ్రత్ బేగం ను సస్పెండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో మండలంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.