గృహ నిర్మాణాల పురోగతిలో బూర్గంపాడుకు జిల్లా ప్రథమ స్థానం!
హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం ఘన సత్కారం
బూర్గంపాడు,(విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల(Indiramma house construction) పురోగతిలో బూర్గంపాడు మండలం(Burgampadu Mandal) ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన మండల హౌసింగ్ శాఖ(Mandal Housing Department) ఏఈ పొడిచేటి ఉదయ్ కిరణ్‌ను పినపాక ఎమ్మెల్యే,శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఈకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.మండలానికి మొత్తం 675 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 625 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
వీటిలో 450 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణాల పురోగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో హౌసింగ్ శాఖ అధికారుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేసి, అర్హులైన లబ్ధిదారులకు త్వరగా గృహాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఏఈ ఉదయ్ కిరణ్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు.కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ కేఆర్కే ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వారాల వేణు, సర్పంచి మందా నాగరాజు, ఉపసర్పంచి గుండె వెంకన్న, నియోజకవర్గ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.