గోదావరి నీటిపై ముందస్తు జాగ్రత్తలు!
- - ఎల్నినో ప్రభావంతో తగ్గుతున్న నీటి ప్రవాహాలు
- - దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో నీటి నిల్వ సామర్థ్యం పెంపు
- - మూడు లేయర్ల పనులు పూర్తి.. మరో రెండు లేయర్లు ఏర్పాటు చేయాలని ఆదేశం
- - మిషన్ భగీరథ ద్వారా మూడు జిల్లాలకు తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు
- - సీతమ్మసాగర్తో 36 టీఎంసీల నీటి నిల్వ, 350 మెగావాట్ల విద్యుదుత్పత్తి
అశ్వాపురం, నవంబర్ 15 (విజయక్రాంతి): ఎల్నినో ప్రభావంతో గోదావరిలో నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు. ఆదివారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించి నీటి నిల్వ కోసం ఇసుక బస్తాలతో చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఇప్పటికే మూడు లేయర్ల పనులు పూర్తయ్యాయని, మరో రెండు లేయర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లతో 1.2 మీటర్లకు పైగా నీటిమట్టాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా మూడు నుంచి నాలుగు నెలల పాటు తాగునీటి అవసరాలు తీర్చవచ్చని పేర్కొన్నారు. అశ్వాపురం నుంచి మిషన్ భగీరథ ద్వారా మూడు జిల్లాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నందున నీటి నిల్వ కీలకమని, ఇసుక బస్తాల నుంచి నీరు లీకేజీ కాకుండా రక్షణ షీట్లు ఏర్పాటు చేసి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు.
సీతమ్మసాగర్ ప్రాజెక్టు పూర్తయితే దుమ్ముగూడెం వద్ద 36 టీఎంసీల నీటి నిల్వతో పాటు 350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ తదితర ప్రాంతాలకు గోదావరి జలాలు సరఫరా చేయవచ్చని తెలిపారు. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ వద్ద అదనంగా మూడు నుంచి నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఇసుక బస్తాలకు నష్టం కలగకుండా పవర్ హౌస్, గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత పది రోజులుగా శ్రమించి మూడు లేయర్ల పనులు పూర్తి చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందిస్తూ, మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని, సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గోదావరి పరివాహక జిల్లాల ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మగారిపల్లి సర్పంచ్ కవిత, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ మహేశ్వరరావు, ఈఈ రాంబాబు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.