డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ హంగులు.. ఆర్టీసీలో కొత్త మార్పులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రజా రవాణాలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా (Electric Buses) మార్చే రెట్రోఫిట్టింగ్ (Retrofitting) కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత బస్సులకే ఆధునిక సాంకేతికతను జోడించి విద్యుత్ వాహనాలుగా తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్, మియాపూర్ వర్క్‌షాపుల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి.
ఈ బస్సుల్లో 300 kWh సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను (Lithium-ion Battery Packs) ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 230 నుంచి 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాటరీ జీవితకాలం పెంచేందుకు ఛార్జింగ్‌ను 80 శాతానికి పరిమితం చేసినప్పటికీ ఈ ప్రయాణ పరిధి సాధ్యమవుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం డీజిల్ బస్సుల నిర్వహణకు కిలోమీటరుకు సుమారు రూ.80 నుంచి రూ.85 వరకు ఖర్చవుతోంది. ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చిన తర్వాత కిలోమీటరుకు దాదాపు రూ.20 వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ వినియోగం కూడా కిలోమీటరుకు ఒక యూనిట్ కంటే తక్కువగా ఉండనుంది.
రెట్రోఫిట్టింగ్ పనుల్లో భాగంగా ఉప్పల్ వర్క్‌షాప్‌లో 200 బస్సులు, మియాపూర్ వర్క్‌షాప్‌లో 40 బస్సుల మార్పిడి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఉన్న బస్సులను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు కొత్త బస్సుల కొనుగోలుపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది.
డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పొగ, శబ్ద కాలుష్యం (Pollution Control) తగ్గే అవకాశం ఉంది. నగరంలో రద్దీగా ఉండే మార్గాల్లో ఇలాంటి బస్సుల వినియోగం పెరిగితే ప్రజా రవాణా మరింత పర్యావరణహితంగా మారనుంది. పాత బస్సులకే కొత్త జీవం పోస్తూ డీజిల్ స్థానంలో విద్యుత్ శక్తిని వినియోగించేందుకు తెలంగాణ ఆర్టీసీ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా రవాణాలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.