కొండరెడ్ల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: మంత్రి తుమ్మల

15-11-2026 | 03:31pm

అటవీ సంపదను కాపాడుకుంటూనే గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి 

ప్రతి చిన్నారి బడికి వెళ్లాలి - గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి 

నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లు, డిజిటల్ రేషన్ కార్డులు, విద్యార్థులకు కిట్ల పంపిణీ చేసిన మంత్రి తుమ్మల 

దమ్మపేట, నవంబర్ 15 (విజయక్రాంతి): మండల పరిధిలోని పూసుకుంట గ్రామంలో కొండరెడ్డి గిరిజనుల జీవన పరిస్థితులు, గ్రామ అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) సంభంధిత శాఖల అధికారులతో కలసి ఆదివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ), భద్రాచలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూసుకుంట, కటుకూరు గ్రామాల గిరిజనుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, కొండరెడ్డి, గుత్తికోయ గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

అటవీ సంపదను పరిరక్షిస్తూనే గిరిజనులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా ఉద్యానవన పంటలు, ఆయిల్‌పామ్, జీడిమామిడి, వెదురు, మునగ వంటి పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. అర్హులైన గిరిజనులకు ఉచితంగా మొక్కలు అందించడంతో పాటు డ్రిప్‌ ఇరిగేషన్‌, అంతర పంటల సాగుకు అవసరమైన సహకారం అందించాలని, భూమి యాజమాన్య హక్కులు, సాగుకు సంబంధించిన అర్హతలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాటిన మొక్కల పెరుగుదలను ప్రతి నెలా అధికారులు సమీక్షించాలని, పంటల నుంచి ఆదాయం వచ్చే వరకు గిరిజన కుటుంబాలకు ఉపాధి హామీ పనుల ద్వారా జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పూసుకుంట, కట్టుకూరు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే అంశంపై సమీక్షిస్తూ, రోడ్లు భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. గతంలో ఎల్‌డబ్ల్యూఈ నిధుల కింద సుమారు రూ.20 కోట్లతో రహదారి నిర్మాణానికి మంజూరు లభించిన నేపథ్యంలో, ఒక్క చెట్టును కూడా తొలగించకుండా ప్రస్తుతం ఉన్న మార్గాన్ని వినియోగించుకుని రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎదురయ్యే అభ్యంతరాలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని తెలిపారు.

గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల వివరాలు, వారికి అందుతున్న సదుపాయాలపై మంత్రి సమీక్షించారు. పాఠశాలలో 31 మంది విద్యార్థులు ఉన్నారని, ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఒక ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారని అధికారులు వివరించారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, పాఠశాల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఐదో తరగతి అనంతరం విద్యార్థులు గురుకుల, ఏకలవ్య తదితర రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునేలా అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇస్కాన్ సహకారంతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

గ్రామంలో వైద్య సేవలపై సమీక్షిస్తూ, ప్రతి పది రోజులకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని, మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా నెలకు రెండుసార్లు వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. గ్రామంలో 46 కుటుంబాలకు చెందిన 139 మంది జనాభా ఉన్నట్లు అధికారులు వివరించారు. మధుమేహం, రక్తపోటు బాధితులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించాలని సూచించారు.

పూసుకుంట, కట్టుకూరు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థానికంగా ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని తెలిపారు. గ్రామంలో దెబ్బతిన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకు స్థానంలో కొత్త ట్యాంకు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి అర్హులైన వారికి గృహ నిర్మాణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని మంత్రి సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ రేషన్ కార్డులు, చేయూత పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద అర్హులైన వారికి జాబ్ కార్డులు అందించి, గ్రామానికి ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, గృహ వసతులు, జీవనోపాధి వంటి మౌలిక సదుపాయాలను గిరిజనులకు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందుతుందని వివరించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులకు ఈ పథకం వర్తిస్తుందని, ప్రతి అర్హ కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. జిల్లా వ్యాప్తంగా చేయూత పింఛన్లు, ఉపాధి హామీ జాబ్ కార్డులు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. గ్రామంలో ఇప్పటికే 16 మందికి పింఛన్లు అందుతున్నాయని, కొత్తగా మంజూరైన అర్హులైన వారికి కూడా పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు ప్రతి నెలా గ్రామాలను సందర్శించి, పథకాల అమలు తీరును సమీక్షించాలని మంత్రి ఆదేశించారు.

గ్రామస్తుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా మంత్రి చేతుల మీదుగా నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, డిజిటల్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేశారు. అలాగే విద్యార్థులకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని పూసుకుంట గ్రామానికి చెందిన కొండరెడ్డి గిరిజన మహిళలు, గ్రామస్తులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి వారి ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎఫ్ డి ఓ కృష్ణమాచారి, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, గృహ నిర్మాణ  పి డి సవేరం, ఐ టి డి ఏ ఏవో గన్య,వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు