అండర్-14 లీగ్ ట్రోఫీకి జిల్లా జట్టు ఎంపిక
చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ నుంచి ఏడుగురు క్రీడాకారులకు చోటు
భద్రాచలం, (విజయ క్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) (హెచ్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్-14 ఇంటర్ స్కూల్ లీగ్ ఛాంపియన్ ట్రోఫీ పోటీలకు(Inter School League Champion Trophy Competition) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) జట్టు ఎంపికైంది. ఈ జట్టులో భద్రాచలంలోని చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీకి చెందిన ఏడుగురు ప్రతిభావంతులైన క్రీడాకారులు స్థానం సంపాదించారు.
అకాడమీ నుంచి ప్రేమ్ సింగ్, నక్క రిత్విక్, కే. రోషన్, లక్కీ చంద్ర, రిత్విక్, హాజీ పాషా, తేజేశ్వర రెడ్డి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఒకే అకాడమీ నుంచి ఏడుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపిక కావడం పట్ల అకాడమీ నిర్వాహకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ కోచ్ శరత్ తేజ మాట్లాడుతూ, తమ అకాడమీ నుంచి ఏడుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. చిన్న వయసులోనే క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూ జిల్లా జట్టులో చోటు సంపాదించడం అభినందనీయమని పేర్కొన్నారు.
రాబోయే పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను తయారు చేయడమే తన లక్ష్యమని కోచ్ శరత్ తేజ తెలిపారు.