నిద్రలోనే పెను విషాదం

12-11-2026 | 11:28am

అర్ధరాత్రి మంటల బీభత్సం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

అరుణాచల్ ప్రదేశ్: అర్ధరాత్రి వేళ నిద్రలో ఉన్న ఓ గ్రామాన్ని అగ్నిప్రమాదం(Arunachal Pradesh Fire Accident) కుదిపేసింది. చూస్తుండగానే మంటలు ఇళ్లకు వ్యాపించి భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆచూకీ తెలియకపోవడంతో విషాదం మరింత తీవ్రమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో ఉన్న పర్సీ-పార్లో పట్టణంలో గురువారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఈ Major Fire Accident చోటుచేసుకుంది.

మంటలు వేగంగా పక్క ఇళ్లకు వ్యాపించడంతో మొత్తం 24 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 19 ఇళ్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో ఐదు ఇళ్లు పాక్షికంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె భర్త మాత్రం కనిపించకుండా పోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన కూడా ప్రమాదంలో చిక్కుకుని ఉంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

మరిన్ని వార్తలు