బంధువు హత్య కేసులో మైనర్ అరెస్ట్

17-11-2026 | 11:32am

ఘట్‌కేసర్, నవంబర్ 17 (విజయక్రాంతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుషాపూర్‌లో ఆదివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడు కేశబోయిన శ్రీనివాస్ (17)ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవుషాపూర్‌లోని జగత్ స్వప్న స్పార్కిల్ క్యాజిల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కుంటి గోర్ల శివ (27)ను అతడి దూరపు బంధువైన శ్రీనివాస్ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ అక్కడే వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. మృతుడి ముఖం, తలపై సిమెంట్ ఇటుకతో పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కత్తితో మృతుడి మర్మాంగాన్ని కోసినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనకు సంబంధించి హత్యకు (Murder Case) ఉపయోగించిన సిమెంట్ ఇటుక, కత్తితో పాటు నేరస్థలంలో రక్తపు మరకలు, పగిలిన బీరు సీసా ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు (Police Investigation) చేపట్టిన పోలీసులకు అవుషాపూర్‌లో తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు, నిందితుడు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఉపాధి (Livelihood) కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి అవుషాపూర్‌లోని జగత్ స్వప్న స్పార్కిల్ క్యాజిల్‌లో రాత్రి వేళల్లో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు.

ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ నేతృత్వంలో ఎస్సై ఎ. రాఘవేంద్ర, పోలీసు సిబ్బంది ఆర్. రాజేష్, పి. విజయ్, పి. రాజు, ఎన్. నరేష్, ఇ. జ్యోతి, బి. సైదులు, మల్లేష్, కుమారి ప్రసన్న, విజయ్, ఏఆర్‌పీసీ సమీర్, ఏఆర్‌పీసీ వినోద్ కేసును ఛేదించారు.

మరిన్ని వార్తలు