మహమ్మదాబాద్‌లో 455 ఇందిరమ్మ ఇళ్లు

17-11-2026 | 11:13am

మహమ్మదాబాద్ (విజయక్రాంతి): పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేసి, పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. మహమ్మదాబాద్ మండలంలోని దేశాయిపల్లి చౌరస్తా వద్ద పల్లవి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) ద్వారా పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందన్నారు. మహమ్మదాబాద్ మండలంలో పూరిగుడిసెల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి 455 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

అదేవిధంగా వికలాంగులు, వితంతువులకు 57 కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేసి ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుందని వెల్లడించారు. అలాగే 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు (Kalyana Lakshmi Cheques) పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తదుపరి చౌదర్‌పల్లిలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనం, మహిళా సమాఖ్య (VO) భవనాలు, ప్రహరీ గోడను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాంలాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎం నారాయణ, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, టాస్క్ జిల్లా ఇన్‌చార్జి సవీణ్ రెడ్డి, సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ భీమ్ రెడ్డి, ఏపీఎం నిర్మల, శాంతిరంగ్యా, పీడీ నరసింహులు, ఏపీవో ఆంజనేయులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు