మహిళా కాంగ్రెస్‌లో మంగకు కీలక పదవి

17-11-2026 | 11:39am

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీలో పలు పదవులను రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి సువర్ణ ప్రకటించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (Agricultural Market Committee) చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగను మహిళా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (State General Secretary) నియమించారు.

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంగ తెలిపారు. మహిళలు రాజకీయాల్లో (Politics) ప్రత్యక్షంగా పాల్గొని తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మంగ గతంలో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, ఆసిఫాబాద్ ఎంపీటీసీగా పనిచేశారు. పద్మశాలి సేవా సంఘం ఉమ్మడి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆమె నియామకం కావడంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండే విఠల్, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు