ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధనౌకల మోహరింపు

17-11-2026 | 11:55am

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు (War Tensions) కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరిస్తోంది. ఇప్పటికే రెండు భారీ విమాన వాహక యుద్ధనౌకలు ఈ ప్రాంతంలో ఉండగా, తాజాగా మరో యుద్ధనౌక రంగంలోకి దిగింది. దీంతో పశ్చిమాసియాలో అమెరికా విమాన వాహక యుద్ధనౌకల సంఖ్య మూడుకు చేరింది.

అమెరికాకు చెందిన యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ (USS Theodore Roosevelt) తాజాగా పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకుంది. ఇప్పటికే అక్కడ మోహరించిన యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్, యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ యుద్ధనౌకలతో కలిసి ఇది విధులు నిర్వహించనుంది. ఈ మూడు యుద్ధనౌకల ద్వారా వేలాది మంది అదనపు సైనికులు (Military Forces) కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు.

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో దాడులు, సముద్ర రవాణాపై ఆంక్షల నేపథ్యంలో అమెరికా ఇంత భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా చర్యలపై ఇరాన్ కూడా అప్రమత్తమైంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి సైనిక చర్యలపై ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. ఇరాన్‌తో చర్చలు నిలిచిపోవడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. అమెరికా సైనిక మోహరింపు (Military Deployment) తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.

మరిన్ని వార్తలు