అర్హుల పెన్షన్లపై ఎమ్మెల్యే కీలక సూచన

17-11-2026 | 11:41am

జనగామ, నవంబర్ 17 (విజయక్రాంతి): అర్హులైన పేదలకు ఏ కారణంతోనూ పెన్షన్లు నిలిపివేయొద్దని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. జనగామ మండలం చీటకోడూరు రైతు వేదిక వద్ద మంగళవారం నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల (New Pension Sanctions) మంజూరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

జనగామ మండలంలోని 21 గ్రామాల్లో మొత్తం 781 మందికి కొత్త పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. వీరిలో 412 మంది వితంతువులు, 86 మంది ఒంటరి మహిళలు, 218 మంది దివ్యాంగులు, 28 మంది నేత కార్మికులు, 77 మంది గీత కార్మికులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాహనం ఉందనే కారణంతో, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఉందనే సాకుతో నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు నిరాకరించొద్దన్నారు. అప్పులు చేసి ట్రాక్టర్లు, డీసీఎంలు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతూ కుటుంబాలను పోషించుకునే పేదల పరిస్థితిని అధికారులు అర్థం చేసుకోవాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న, తిరస్కరణకు గురైన దరఖాస్తులను (Pending Applications) మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. దివ్యాంగుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్‌తో పాటు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా నిరంతరం నిలబడతానని, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య, విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు