ఓటరు నమోదుకు మరో అవకాశం

07-11-2026 | 07:00pm

జగిత్యాల,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు(Voting Rights) కల్పించడమే ఎన్నికల సంఘం(Telangana Election Commission) లక్ష్యమని, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి(State Chief Electoral Officer C. Sudarshan Reddy) తెలిపారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సర్-2026 ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయడం, గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, ద్వంద ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్ల వివరాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మరో ఏడు రాష్ట్రాల్లో సర్ - 2026 ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ అవకాశం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు మరొక అవకాశం

సర్-2026 ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని వారు మరోసారి తమ ఫారాలను సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం, డబుల్ తదితర కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఆబ్సెంట్ , షిఫ్టెడ్, డెత్, డబుల్ జాబితాలో తమ పేర్లు ఉండి ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని అర్హులైన వారు నవంబర్ 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించవచ్చని తెలిపారు.  అర్హులైన వ్యక్తులు తమ వివరాలను సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించి ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవాలని సూచించారు. ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి

ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశ్యం అర్హులైన ఏ ఒక్క ఓటరును కూడా ఓటు హక్కుకు దూరం చేయకుండా చూడటమేనని సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన వ్యక్తులు తమ వివరాలను సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించి ఓటరు జాబితాలో పేరు చేర్చుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి విచారణ చేపట్టి, అర్హులైన ఓటర్లను గుర్తించి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయాలని సూచించారు. ఫారాలు అందని ఓటర్లను గుర్తించి, వారికి తిరిగి ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు అనుసంధానమై ఉన్న ఓటర్లకు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా కూడా ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాలను ప్రదర్శించాలి

గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, ఆబ్సెంట్ , షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాల రూపంలో ప్రదర్శించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఆయా ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చకపోవడానికి గల కారణాలను కూడా స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు.

ఈ వివరాలను ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు, ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పోలింగ్ కేంద్రాల వారీగా అందుబాటులో ఉంచాలని సూచించారు. జాబితాల్లోని వివరాలను పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలని, అర్హులైన ఓటర్లు తమ పేర్లను తిరిగి నమోదు చేసుకునేందుకు అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు.

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఆన్‌లైన్ సౌకర్యం

ఓటర్లు తమ పాత ఎపిక్ నంబర్ ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్, ఈసీఐనెట్ యాప్ ద్వారా కూడా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని సమర్పించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఒకే చిరునామాలో నివసిస్తున్న ఓటర్లు గతంలో ఎన్యుమరేషన్ ఫారం ఎందుకు సమర్పించలేకపోయారో వివరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. చిరునామా మారిన వారు సంబంధిత చిరునామా ఆధారాలను సమర్పించాలని తెలిపారు.

అదే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు కొత్త చిరునామాకు సంబంధించిన ఆధారాలను సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. సమర్పించిన ఫారాలను సంబంధిత ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లను తుది ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు తుది ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మొత్తం 77 వేల మంది గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, ద్వంద,  ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా ఆబ్సెంట్ , షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏల) సమన్వయంతో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ జాబితాలో ఉన్న ప్రతి ఓటరు ఇంటిని మరోసారి క్షేత్రస్థాయిలో సందర్శించి, వారి వివరాలను పరిశీలించాలని సూచించారు. అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని తెలిపారు. ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు అనుసంధానమై ఉన్న ఆబ్సెంట్ , షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్లకు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను పంపించాలని ఆదేశించారు.

ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సమర్పించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితాలో పారదర్శకత ఉండేలా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒకే ఓటరు పేరు రెండుసార్లు నమోదు కాకుండా, ద్వంద్వ ఓటింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ప్రసునాంబ, ఆర్.డి.ఓ.లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు