అటవీ సంపదల నిర్వహణాధికారి
పాలకుర్తి రామమూర్తి :
కుప్యాధ్యక్షో ద్రవ్యవనపాలైః
కుప్యమానాయ యేత్.
ద్రవ్యవన కర్మాంతాశ్చ ప్రయోజయేత్. ద్రవ్యవనచ్ఛిదాం చ దేయమత్యయం
చ స్థాపయేత్, అన్యత్రాపద్భ్యః!
(కౌటీలీయం-2-17)
అటవీ వనరుల నిర్వహణ బహుళ(Forest resource management is multifaceted.) ప్రయోజనకారి అనే విషయాన్ని చాణక్య(Chanakya) గుర్తించిన విధానం విదితమౌతున్నది. పర్యావరణాన్ని కాపాడడం, వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, ఆదాయాన్ని సమకూర్చుకోవడం అడవుల రక్షణలో ప్రముఖ ప్రయోజనంగా భావించాలి. సహజమైన అడవుల సంరక్షణతో పాటుగా ఉద్యానవనాల నిర్మాణం, వాటి సంరక్షణ లాంటి సమగ్ర నిర్వహణా విధానం కూడా కౌటిలీయంలో ప్రస్తావించబడింది.
కుప్యాధ్యక్షుడు అనగా అటవీ ప్రాంతాల(Forest areas) నుంచి లభించే విలువైన వనరుల సేకరణ, నిలువచేయడం, వాటి వినియోగం, వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చే వ్యవస్థను పర్యవేక్షించే అధికారి. అయితే అతనిని ఈనాడు మనం వ్యవహరించే అటవీశాఖాదిపతితో సమానమని భావించలేము. ద్రవ్యవనం అనగా రాజ్యానికి ద్రవ్యం లేదా ధనం సంపాదించే అరణ్యం.. కుప్యం అనగా అడవుల నుండి లభించే విలువైన వస్తువులు. కర్మాంతాలు అనగా కర్మాగారాలు.
కుప్యాధ్యక్షుడు ద్రవ్యవనపాలకులచేత కుప్యాన్ని తెప్పించాలి. అలా అడవుల నుండి సేకరించిన విలువైన వస్తువులతో ఆయా ఉత్పత్తులను తయారుచేసే కర్మాగారాలను ఏర్పరచాలి. ద్రవ్యవనాలను సేకరించే వారికి ఇవ్వవలసిన జీతభత్యాలను మరియు అనుమతులు లేకుండా అడవులను ఛేదించే వారికి విధించవలసిన శిక్షలను నిర్ధారణ చేయాలి. ఇక్కడ అడవి నుండి ముడి సరకులను సేకరించడమే కాక వాటిని పరిశ్రమలలో వినియోగానికి అనువైన నాణ్యమైన ఉత్పత్తులుగా మార్చడం వల్ల దాని విలువను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రక్రియను కూడా చాణక్య ప్రస్తావించాడు. అయితే ఆపత్సమయంలో ఇది చేయవలసిన పనిలేదు, అంటున్నాడు, ఆచార్య చాణక్య.
అడవులలో పశువులకు అవసరమైన గడ్డి, మంచి కఱ్ఱలను ఇచ్చే వృక్షాలు, వేణువులాంటి సంగీత సాధనాలు తయారుచేసే వెదురుజాతి వృక్షాలు, తీగలు, బెరళ్ళు, త్రాళ్ళుపేనడానికి ఉపయోగపడే సామగ్రి, తాటిచెట్లు, కుంకుమ మొక్కలు, ఔషధాలకు సంబంధించిన మొక్కలు, విషాన్ని తయారుచేసే క్రిమికీటకాలు.. ఇలా పలు విధాలయిన సంపద లభిస్తుంది. అలాగే పులులు, ఉడుములు, లేళ్ళలాంటి వివిధ మృగాలు, పక్షులు క్రూరమృగాల శరీరావయవాలు లభిస్తాయి.
అలా వివిధ జంతువుల చర్మాలు, ఎముకలు, కొమ్ములు, దంతాలు మొదలైన వాటిని కూడా చాణక్య అటవీ సంపదలో భాగంగా పేర్కొన్నాడు. అలాగే కొన్ని విధాలయిన క్రిమికీటకాదులను, పాములను పట్టించి వాటి విషాన్ని తీయడం, వాటిని మారణౌషధాల తయారీలో ఉపయోగించడం జరిగేది. అలాంటి వాటిని సేకరించడం, కుండలలో పెట్టి భద్రపరచే బాధ్యత కూడా కుప్యాధ్యక్షునికి ఉంటుంది. అయితే ఈనాడు ప్రభుత్వాలు వన్యప్రాణుల వేట, వాటి అవయవాల వ్యాపారం శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తూ చట్టాలు తెచ్చాయి.
అడవులలో బొగ్గు, బంగారం, వజ్రాలు, వెండి, రాగి, సీసము, తగరము, ఇనుము, ఇత్తడి, కంచులాంటి లోహాలను వెలికితీసే గనులను గుర్తించడం, ఆయా ఉత్పత్తులను వెలికితీయడమే కాక వాటి ఉత్పత్తులను భద్రపరచడం కూడా కుప్యాధ్యక్షుని బాధ్యతలే. అయితే.. ఈ గనులు అడవిలో ఉంటే ఆ బాధ్యత కుప్యాధ్యక్షునికి, జనపదాలలో ఉంటే ‘ఆకరాధ్యక్షునికి’ సూచించాడు, చాణక్య. కోట లోపల, బయట అడవుల నుండి లభించే వస్తువులతో శిల్పుల వృత్తి కొరకు, నగర రక్షణ కొరకు అన్ని విధాల వస్తువులను తయారుచేసే కర్మాగారాలను నెలకొల్పాలి, అంటారాయన.
గనుల వల్ల సంపద సృష్టించబడుతుంది. సంపద వల్ల అధికారం వస్తుంది. గనులలో ముఖ్యంగా యుద్ధపరికరాలకు, విలువైన లోహాలకు మూలమైన గనులను ప్రభుత్వమే నిర్వహించేది. ఈనాడు కూడా ప్రభుత్వాలు అటవీసంపదను సంరక్షించడానికి పలు చర్యలను తీసుకుంటున్నాయి. అటవీ అధికారుల నేతృత్వంలో వృక్షాలను సంరక్షించి పర్యావరణాన్ని కాపాడడం, జీవావరణ సమతుల్యతను కాపాడుతుంది.
గిరిజన కార్పొరేషన్ ద్వారా అటవీ ఉత్పత్తులను సేకరించి విపణీ వీధిలో అమ్మించడం లాంటి చర్యల ద్వారా గిరిజనులకు ఉపాధిని కల్పించడం, నాణ్యతగలిగిన వస్తువులను వినియోగదారునికి అందించడానికి చర్యలు చేపడుతుంది. ఎండిపోయిన చెట్లను నరికించడం, ఎవరైనా ప్రభుత్వానుమతి లేకుండా నరికిన చెట్లను పట్టుకొని వాటిని టెండర్ల ద్వారా అమ్మించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయము సమకూరుతున్నది. అలాగే ‘వన్యప్రాణుల సంరక్షణ‘ ద్వారా అడవిలోని జంతువులను రక్షించే బాధ్యతనూ నిర్వహిస్తున్నది. ముఖ్యంగా పులులు ఉన్న అడవి సుభిక్షంగా ఉన్నట్లుగా భావిస్తారు.
వేసవిలో అడవులలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న స్థలాలను గుర్తించడం, ఆ స్థలాలలో వేసవికి ముందే ‘ఫైర్ లైన్స్‘ (అగ్ని నిరోధక మార్గాలు) ఏర్పాటు చేయడం, కంట్రోల్ బర్నింగ్ లాంటి చర్యలు చేపట్టడం, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఉపగ్రహ హెచ్చరికల ద్వారా మంటలను సకాలంలో ఆర్పడం లాంటి చర్యలు అటవీశాఖాధిపతులు సమర్థవంతంగా చేపడుతున్నారు.
అడవులలో కలపను దొంగతనంగా నరికి, తరలించి విక్రయించే నేరాలకు అలవాటుగా పాల్పడే వ్యక్తులపై సాధారణ అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు, అలాంటి అక్రమ కార్యక్రమాలను నిరోధించే చర్యలలో భాగంగా, చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా, సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ వారి అనుమతితో పి.డి. చట్టాన్ని ప్రయోగించడం కూడా జరుగుతుంది. ఈ విధానంలో చెక్‌పోస్టులు, మొబైల్ స్క్వాడ్స్ నిరంతరం పనిచేస్తుంటాయి.
అయితే కొన్ని పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూసేకరణకై అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు మళ్లించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉదాహరణకు, నిత్యజీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్న విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు ప్రధాన వనరు. విద్యుత్తు తయారీకి అవసరమైన బొగ్గును వెలికితీయడానికి, విద్యుత్ లైన్లను వేయడానికి, త్రాగునీటి అవసరాలకు అటవీ భూమిని వినియోగించవలసి రావచ్చు.
అటువంటి సందర్భాలలో నిర్వాహక సంస్థలు సంబంధిత ప్రభుత్వ అనుమతులు పొందడంతోపాటు, వినియోగానికి మళ్లించిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా సమానమైన అటవీయేతర భూమిని బదలాయించడంతో పాటు, ప్రభుత్వం నిర్ణయించిన ‘నెట్ ప్రెసెంట్ వ్యాల్యూ‘ పరిహారాన్నీ, ‘క్యాంపా‘ నిబంధనల క్రింద పరిహార అటవీకరణ నిధులు ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ నిధులతో కోల్పోయిన పచ్చదనాన్ని పునరుద్ధరించే బాధ్యతను అటవీ శాఖే శాస్త్రీయంగా నిర్వర్తిస్తుంది. ఈ నిబంధనలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండూ పాటించవలసి ఉంటుంది.
ప్రకృతి ప్రసాదించిన వనరులను గుర్తించడం, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, వాటి ద్వారా సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో, ఆ వనరులు అంతరించకుండా సంరక్షించడం కూడా అంతే ప్రముఖమైనది. చాణక్య అడవులలో లభించే వివిధ వనరులను గుర్తించడం, వాటిని సేకరించి పరిశ్రమలద్వారా ఉత్పత్తులుగా మార్చడం, అవసరానుగుణంగా వినియోగించడం, అక్రమ వినియోగాన్ని నియంత్రించడం గూర్చి ప్రస్తావించి ఒక వ్యవస్థను రూపొందించగా... ఆధునిక కాలంలో వాటికి పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ వంటి అదనపు బాధ్యతలు కూడా తోడయ్యాయి. ప్రకృతి వనరులను ప్రస్తుత అవసరాలకు వినియోగించుకుంటూనే, భవిష్యత్ తరాలకు వాటిని అందించగలగడమే సమర్థవంతమైన వనరుల నిర్వహణకు నిజమైన నిదర్శనంగా భావించాలి.