తమసోమా జ్యోతిర్గమయ: నోబెల్ బహుమతి సనాతన ధర్మం

14-10-2026 | 05:00am

డా. బూర నర్సయ్యగౌడ్ :

వెలుగు, జీవం, చైతన్యం -ఆధునిక విజ్ఞానానికి, ప్రాచీన 

భారతీయ తాత్విక జ్ఞానానికి మధ్య సారూప్యత.

2026 వైద్యశాస్త్ర(Medical Science) నోబెల్ బహుమతి(Nobel Prize) పొందిన కార్ల్ డైసెరోత్(Karl Deisseroth), పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్ చేసిన ఆప్టోజెనెటిక్స్ పరిశోధనలు ఆధునిక నాడీవిజ్ఞాన శాస్త్రానికి, ప్రాచీన సనాతన ధర్మ తాత్విక చింతనకు మధ్య ఆసక్తికరమైన పోలికలను ఆవిష్కరిస్తున్నాయి. కాంతికి స్పందించే ఆప్సిన్స్ అనే ప్రొటీన్ల సహాయంతో మెదడులోని నిర్దిష్ట నాడీకణాలను ఉత్తేజపరచడం లేదా వాటి క్రియాశీలతను నియంత్రించడం ఈ సాంకేతికత ప్రత్యేకత(Technological Specialty). జ్ఞాపకశక్తి, భావోద్వేగాలు, ప్రవర్తన, నాడీ సంబంధిత వ్యాధుల పరిశోధనలో ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. ఆశ్చర్యకరంగా, వేల సంవత్సరాల క్రితమే హిందూధర్మ గ్రంథాలు వెలుగును జ్ఞానానికి, బుద్ధికి, చైతన్యానికి, మోక్షానికి ప్రతీకగా అభివర్ణించాయి.

బృహదారణ్యక ఉపనిషత్తు (1.3.28)లోని ‘అసతోమా 

సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా

అమృతంగమయ’ అనే మహావాక్యం అసత్యం నుంచి సత్యానికి, అం ధకారం నుంచి వెలుగుకు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించమని ప్రార్థిస్తుంది. ఇక్కడ చీకటి అజ్ఞానానికి, వెలుగు జ్ఞానానికి, పరివర్తనకు ప్రతీకలు. ఆప్టోజెనెటిక్స్ పరిశోధనల్లో కాంతి ద్వారా నాడీకణాల విద్యుత్ కార్యకలాపాలను మార్చగలుగుతున్నారు. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక పరివర్తనను బోధిస్తే, ఆధునిక విజ్ఞానశాస్త్రం కణస్థాయిలో జరిగే భౌతిక పరివర్తనను నిరూపిస్తోంది.

ఋగ్వేదంలోని (3.62.10) ప్రసిద్ధ గాయత్రీ మంత్రం 

‘ఓం భూర్భువః స్వః, తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య

ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్’ సూర్యుని దివ్య తేజస్సు మన బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించాలని ప్రార్థిస్తుంది. ఆధునిక నాడీవిజ్ఞాన శాస్త్రం కూడా కాంతి మన జీవగడియారాన్ని, నిద్రను, మెదడు పనితీరు ను ప్రభావితం చేస్తుందని నిరూపించింది. ఆప్టోజెనెటిక్స్ మరో అడుగు ముందుకేసి కాంతితో నిర్దిష్ట నాడీకణాలను నియంత్రించే అవకాశాన్ని కల్పించింది. గాయత్రీ మంత్రం కాంతిని మానసిక వికాసానికి ప్రతీకగా భావిస్తే, విజ్ఞానశాస్త్రం కాంతికి, నాడీవ్యవస్థకు మధ్య ఉన్న జీవసంబంధాన్ని వివరిస్తోంది.

‘ఉద్వయం తమసస్పరి, జ్యోతిష్పశ్యంత ఉత్తరమ్’ 

(ఋగ్వేదం 1.50.10) అనే మంత్రం అంధకారాన్ని

అధిగమించి అత్యున్నత తేజస్సును దర్శించడాన్ని వర్ణిస్తుంది. సూర్యకాంతి ద్వారానే కిరణజన్య సంయోగక్రియ జరిగి భూమిపై జీవవ్యవస్థలు మనుగడ సాగిస్తున్నాయని శాస్త్రం నిర్ధారించింది. విశేషమేమిటంటే, కాం తికి స్పందించే ఆకుపచ్చ శైవలాల్లోని ప్రోటీన్లపైజరిగిన పరిశోధనలే ఆప్టోజెనెటిక్స్ అభివృద్ధికి పునాది.ప్రకృతిలోని కాంతి స్పందన వ్యవస్థ నేడు మానవ మెదడు రహస్యాలను తెలుసుకునే శాస్త్రీయ సాధనంగా మారింది.

భగవద్గీత (10.11)లో శ్రీకృష్ణుడు అజ్ఞానజం 

తమః నాశయామి జ్ఞానదీపేన భాస్వతా అంటూ

ప్రకాశవంతమైన జ్ఞానదీపంతో అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తానని బోధించాడు. ఆధునిక నాడీవిజ్ఞాన శాస్త్రం జ్ఞాపకశక్తి, అభ్యాసం వెనుక నాడీకణాల పాత్రను పరిశోధిస్తుంటే, గీతజ్ఞానం వివేకానికి, ధర్మబద్ధమైన ఆచరణకు దారితీయాలని ఉపదేశిస్తోంది.

నోబెల్ పరిశోధన.. కాంతితో మెదడును ఎలా ప్రభావితం చేయవచ్చో వివరిస్తే, సనాతన ధర్మం జ్ఞానోదయం పొందిన మానవ మేధస్సు సమాజానికి ఎలా ఉపయోగపడాలో బోధిస్తుంది. విజ్ఞానశాస్త్రం ప్రక్రియనువివరిస్తుంది, ధర్మం ప్రయోజనాన్ని నిర్దేస్తుంది.ఈ రెండింటి అంతిమ సందేశం ఒక్కటే అనిపిస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ అంధకారం నుచి వెలుగుకు, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, జ్ఞానం నుంచి వివేకానికి, వివేకం నుంచి మానవాళి సంక్షేమానికి!

వ్యాసకర్త: పార్లమెంట్ 

మాజీ సభ్యులు

 భువనగిరి, ధార్మిక 

హిందూ పరిషద్ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు