‘రైతు డిస్కమ్’తో ఉచిత విద్యుత్‌కు ఎసరు!

14-10-2026 | 05:25am
  1. కాంగ్రెస్ కుట్రలను బీఆర్‌ఎస్ సహించదు
  2. రైతు డిస్కం జీవోను ఉపసంహరించుకోవాలి
  3. మాజీ మంత్రి హరీశ్ రావు 

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రైతు డిస్కమ్(Farmer DISCOM) పేరుతో ఉచిత విద్యుత్‌కు(Free electricity) ఎసరు పెట్టే కుట్ర చేస్తున్నారని, రైతన్నకు ఉరి వేసే కాంగ్రెస్ కుట్రలను బీఆర్‌ఎస్ సహించదని మాజీమంత్రి హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. రైతు డిస్కం జీవోను(Farmer DISCOM GO) తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు(Employee Associations), విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో17 జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర అని విమర్శించారు. వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటన్నారు. జీవో ప్రకారం కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, వాటర్‌వర్క్స్, మిషన్ భగీరథ.. మొత్తంగా 30,62,853 కనెక్షన్లు రైతు డిస్కంకి బదిలీ చేశారన్నారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వాహణ కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. 

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, రైతుల అనుమానాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడం కుదరదన్నారు. 

స్థానిక వెండర్ల ద్వారానే సరుకులు సరఫరా చేయాలి

రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నిత్యావసర సరుకుల సరఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతంలో అమలులో ఉన్న విధంగా డిస్టిక్ట్ పర్చేస్ కమిటీ ద్వారా, పాఠశాలను ఒక యూనిట్‌గా పరిగణించి స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావుకు తమ గోడు విన్నవించుకోవడంతో మీడియాతో మాట్లాడారు.

గురుకులాల్లో పేద విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫాంలు, నోట్ బుక్స్, ట్రంక్ పెట్టెల ఇతర వస్తువుల కొనుగోళ్ల టెండర్లలో దాదాపు రూ. 2 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని గతంలోనే తాము ఆధారాలతో సహా నిరూపించామని హరీశ్ రావు గుర్తుచేశారు. స్థానిక వెండర్లను తప్పించేందుకు జీవోఏ పేరుతో మొదట జిల్లా యూనిట్ అని, ఆ తర్వాత రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల భారీ ఈఎండీలు పెట్టి వారిని పోటీ లేకుండా చేశారని ఆక్షేపించారు. బ్లాక్ లిస్టులో పెట్టిన సంస్థకు రూ. 800 కోట్ల కాంట్రాక్టును ఎలా అప్పగిస్తారని నిలదీశారు.

పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. 12 మంది సబ్ కాంట్రాక్టులు, అక్కడి నుంచి 33 జిల్లాలకు, ప్రతీ జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున ఏకంగా రూ. 66 కోట్ల గుడ్‌విల్, 20 శాతం కమీషన్ల ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి దీని వెనుక చక్రం తిప్పుతున్నారని, సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

జూన్ నెల నుంచే సరుకులు ఇవ్వాల్సిన సదరు సంస్థ ఇప్పటివరకు సరఫరా చేయలేకపోయిందని, దసరా పండుగ సెలవులకు ముందు రాష్ట్రంలోని దాదాపు 4 వేల హాస్టళ్లలో కేవలం 280 కేంద్రాలకే నామమాత్రంగా సరుకులు పంపారని, అవి కూడా ఎలాంటి బ్రాండ్, బిల్లు, ఎక్స్‌పైరీ డేట్ లేని అత్యంత నాసిరకం వస్తువులని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిమయమైన పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు