కరువు కోరల్లోకి తెలంగాణ
ధీరన్ కొడారి :
ఏ ప్రభుత్వమైనా తన ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకోవాలి. అందుకు రాబోయే కరువు కాటకాలను ముందుగానే అంచనా వేయాల్సి ఉంటుంది. నదులు,చెరువులు,కుంటలను(Rivers, lakes, and ponds) అనుసంధానం చేస్తూ ప్రతి వర్షపు బొట్టును నిలువ చేయాలి. అప్పుడే ఆ రాజ్యం పాడిపంటలతో తులతూగుతుంది. ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో(impact of El Niño) రాష్ర్టం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుందని ప్రకటించిన పాలకులు.. రాబోయే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందే సంసిద్ధులు కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
భారత ఉప ఖండంలో సింధూ నాగరికత నుంచి చెరువులు తవ్వి, నీటిని నిల్వ చేసే బృహత్తర కార్యం మొదలైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కానీ, ఈ ఆధునిక యుగంలో ఇక్కడి పాలకుల ముందు చూపులేని మందబుద్ధితో రైతాంగం, ప్రజలు కరువు కోరల్లోకి క్రమంగా జారుకునే దుస్థితి నేడు దాపురించింది. సాంకేతిక పరిజ్ఞానం ఉనికిలోనే లేని కాలంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన ప్రసిద్ధ రాజవంశం చోళ రాజులు (క్రీ.శ 850--1270వరకు) తమ పాలనలో వ్యవసాయానికి పెద్దపీట వేశారు.
నీటి పారుదల, కాలువల నిర్మాణం, చెరువులు, కుంటలు తవ్వి వర్షపు నీటిని ఒడిసిపట్టి కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో హరిత విప్లవాన్ని సృష్టించి ప్రజలు సుఖశాంతులతో బతికేలా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ రోజుల్లోనే పాలకులు ప్రజల పట్ల ఎలా ఉండాలో, ఏం చేయాలో చేసి చూపారు. అలాగే కాకతీయుల కాలం (సుమారు క్రీ.శ 12--14 శతాబ్దాలు)లో వ్యవసాయం ప్రజల ముఖ్య జీవనాధారం.
వారు తెలంగాణ భౌగోళిక అవసరాలకు అనుగుణంగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేపట్టి గ్రామీణ ప్రాంతాలు సిరిసంపదలతో తులతూగేలా చేశారని చెప్పాలి. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఒక ధర్మ కార్యంగా భావించేవారు. అలాంటిది ఇంత అభివృద్ధి చెందిన కాలంలో పాలకులు ఎలా ఉండాలి, ముందుచూపుతో ఎలా వ్యవహరించాలి? వీటికి ప్రస్తుత పాలకుల తీరు చూస్తే సమాధానం దొరకని పరిస్థితి.
స్వరాష్ట్రంలో జల విప్లవం
గతంలో తెలంగాణ అంటేనే గుట్టలు, రాళ్లు, నెర్రరిన నేలలు గుర్తుకు వచ్చేవి. కానీ,ఆంధ్ర పాలకుల పీడన నుంచి 2014 జూన్ 2న, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏర్పడ్డ మొదటి ప్రభుత్వంలో చోళ రాజుల మరియు కాకతీయుల పాలనను గుర్తుకు తెచ్చేలా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలనే పట్టుదలతో ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు, కాలువల నిర్మాణానికి పెద్ద భగీరథ ప్రయత్నమే జరిగిందని చెప్పాలి. గతకాలపు కరువును చూసిన అనుభవంలో నుంచి పాలకులు ముందుగానే సాగు, తాగు నీటి వనరులపై దృష్టి సారించారు.
తెలంగాణలోని సంప్రదాయ చెరువులకు జీవం పోస్తూ, వాటి పునరుద్ధరణకు కంకణం కట్టారని చెప్పడంలో సందేహం లేదు. వర్షపు నీటిని స్థానికంగా నిల్వ చేసుకోవాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పేరుతో, రైతులు, పశువులు, గ్రామీణ ప్రాంత ప్రజల నీటి అవసరాలు తీర్చడమే పరమావధిగా ముందడుగు పడింది. చెరువుల పూడిక తీయడం, చెరువు కట్టలు, తూములు, మత్తడులకు మరమ్మత్తులు, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, సాగునీరు అందించడం అనే ప్రయత్నం నిర్విగ్నంగా జరిగింది.
ప్రజాప్రభుత్వ ముదస్తు వైఫల్యం
గత ఎన్నికల్లో ప్రజామోదం పొంది గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తన తెంపరితనంతో పాలనలో అనేక సమస్యలను కొని తెచ్చుకుంటుందని చెప్పాలి. ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య రాష్ర్టంలో మొత్తం 621 మండలాలకు గాను, 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అందులో 111 మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా, 254 మండలాల్లో మధ్యస్థ కరువు ఉంటుందని ప్రకటించింది.
ఇక కరువు మండలాల ప్రకటనలో కూడా వివక్ష చూపుతున్నారని, ఇంకా చాలా మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తున్నాయి. అసలు వర్షాభావ పరిస్థితులు రాకమునుపే పాలకులు మెళకువగా వ్యవహరిస్తే బాగుండేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లో తెలంగాణ సమృద్ధిగా నీటిని వినియోగించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే వారం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 79 శాతం ప్రాంతం గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోకి వచ్చింది. రాష్ర్టంలో సుమారు 450 కిలో మీటర్ల దూరం ప్రవహించే గోదావరి నదిపై రాష్ట్ర ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాళ్లు తేలిన నెలల్లో రత్నాలు పండించే ప్రయత్నం చేసింది. దానికి అనుసంధానమైన బరాజ్‌లలో లోపాలు తలెత్తడంతో 2023 అక్టోబర్‌లో జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎస్ఏ) మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించింది.
ప్రణాళిక, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ లోపాలే పిల్లర్లు కుంగిపోవడానికి కారణం అని తెలిపింది. అలాగే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణాలను కూడా ఎన్డీఎస్ఏ పరిశీలించింది. బరాజ్‌ల కింది భాగంలో ఖాళీలు ఏర్పడడం, పునాది కింద నేల కోతకు గురికావడం సమస్యలను గుర్తించి, వాటి పునరుద్ధరణకు తగు చర్యలు చేపట్టాలని సూచనలు చేసింది.
రాష్ట్రానికి జీవనధారంలాంటి ప్రాజెక్టుపై రాష్ట్ర పాలకులు ఇంతకాలం ఏం చేస్తున్నట్టు?. అసలు రాష్ట్ర ఆనకట్టల భద్రత సంస్థ సక్రమంగా పని చేస్తుందని అనుకోవాలా?, రాష్ట్ర ఆనకట్టల భద్రత కమిటీ దేనికి ఉన్నట్టు?. ప్రాజెక్టుల్లో నీరు నిలువ చేస్తే ప్రమాదం జరుగుతుందని లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతుంటే చూస్తూ, ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించకుండా ఉండగలమా. రాష్ట్ర ప్రయోజనాలకే పెద్ద పీట వేసి గత ఒరవడిని అంతకు మించి కొనసాగించాల్సిన ప్రస్తుత పాలకులు దాన్ని విస్మరిచడం బాధాకరం.
ప్రాజెక్టులపై రాజకీయాలను వీడాలి!
కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజల బాగుకోసం నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి పెట్టి, వాటిని సమర్ధవంతంగా నిర్వహించి ప్రజలతో పాటు ప్రతిపక్షాల మన్ననలు పొందాల్సింది ఉంది. ఆ విధంగా చేయకుండా గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులను ప్రశ్నార్థకం చేస్తూ, గత పాలకుల ఉనికిని చేరిపేసే ప్రయత్నంలో, ప్రజాప్రయోజనాలను గాలికొదిలి ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. అదీకాక తెలంగాణ నీటి అవసరాలను తీర్చే ఆనకట్టలను నిర్వీర్యం చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకోవడం ఇది ప్రజలు విశ్వసించేలా ప్రవర్తించడం పాలకులకే నష్టాన్ని తెచ్చిపెడుతుంది.
మొత్తంగా ప్రభుత్వ కరువు ప్రకటనతో రాష్ట్ర రైతాంగానికి, కూలీలకు ఒక రకంగా కొంత ప్రయోజనం చేకూరినట్టే అనుకోవాలి. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులు కోరే అవకాశం ఉన్నందున.. కరువుతో వ్యవసాయ రంగం దెబ్బతిని గ్రామీణ ప్రజలు, రైతులు ఉపాధి కోల్పోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ సాయంతో ఉపాధిహామీ పథకం (వీబీజీ రామ్ జీ) ద్వారా ఎక్కువ పనిదినాలు కల్పించే అవకాశం ఉంటుంది.
దీనికి తోడు పట్టణ, పల్లె ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగు నీరు, పశుగ్రాసం మరియు వాటికి ప్రత్యేక నీటి వసతి ఏర్పాట్లు చేయడం, కరువును జయించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రజలకు కాస్త ప్రయోజనం కలిగే వీలు ఏర్పడుతుంది. అయితే రాష్ర్టంలో ఇప్పటికే 24 శాతం లోటు వర్షపాతం నమోదవగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు ఎంత వరకు పెరుగుతాయనేది వేచి చూడాలి.
వ్యాసకర్త సెల్: 8008200664