ఆగమశాస్త్రం పాటిస్తున్నారా?
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి(Lord Sri Venkateswara) కొలువుదీరిన తిరుమలలో అన్ని కైంకర్యాలు, నిర్మాణాలు ఆగమశాస్త్రం ప్రకార మే జరుగుతున్నాయా లేదా పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయా అనే విషయంలో చాలామందికి అనుమానాలు న్నాయి. ఈ విషయంలో ఒకనాసి పునఃశ్చరణ చేయాల్సిన అవసరం ఉందని ఆగమశాస్త్ర నిష్ఠాగరిష్టులు, నిపుణులు, మఠాధిపతులు, పీఠాధిపతులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆధీనం లోని పాలకమండలి నిర్ణయాలు, పూజా కైంకర్యాల్లో తరచూ మార్పులుచేర్పులు చేయడం, శాస్త్ర ప్రకారం ఇప్పటికే ఉన్న కొన్ని కట్టడాలను నిర్మూలించి కొత్తగా నిర్మించటం లాంటి చర్యలు ఈ సందేహాలకు తావిస్తున్నది.
ఆగమశాస్త్రంలో ఏముంది?
అసలు ఆగమ శాస్త్రం అంటే భగవంతుని చేరుకునే మార్గాలు. ఆలయ నిర్మా ణం , విగ్రహ ప్రతిష్ఠ, పూజా ఉత్సవ విధానాలను నిర్దేశించే ప్రాచీన గ్రంథ సమా హారం. ఈ ఆగమాలలో కూడా రెండు సంప్రదాయాలున్నాయి. ఒకటి శైవాగమం, రెండవది వైష్ణవాగమం. వైష్ణవా గమం లో శ్రీమహావిష్ణువు ఆరాధనకు సంబంధించి వైఖానస మరియు పంచారాత్ర ఆగమనాలు ప్రధానమైనవి. తిరుమ లలోని శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమన విధానం అనుసరించే పూజాదికాలు జరుగుతాయి.
అయితే ఆయా ప్రభుత్వాలు, వాటి ఆధ్వర్యంలోని పాలక మండ లులు కొంత అనాలోచనతో చేపట్టిన చర్యల వలన తిరుమలలో ఆగమశాస్త్రం ఏమైనా పక్కదారి పట్టిందా? లేదా అనేది పలువురిలో మెదులుతున్న సందేహాలు. ఈ విషయంలో ఆగమ శాస్త్ర పరిరక్షకులు, హిందుత్వాన్ని, సనాతన ధర్మ పరిరక్షకులైన మఠాధిపతులు, పీఠాధిపతులు చర్చించాల్సి ఉందనే పండితుల అభిప్రాయాన్ని కాదనలేము.
నిబంధనలు పాటిస్తున్నారా?
ఆలయ వైభవం, పవిత్రత, ఆగమ శాస్త్రం పరిరక్షించి నిత్యం ధార్మిక ప్రచారం, వేద పారాయణం, యాత్రీకుల వసతికి ఉచిత లేదా నామ మాత్రపు రుసుముతో సత్రాలు కేటాయించేందుకు, అన్నదానం కల్పించటానికి మాత్రమే వినియోగించేలా సుమారు 35 మఠాలకు తిరుమల లో స్థలం కేటాయించింది. ఆయా మఠాలు సత్రాలు లేదా ఆశ్రమాలు నిర్మించుకునేందుకు టీటీడీ అనుమతులిచ్చింది. వాటిలో ప్రధానంగా శ్రీఅహోబిల మఠం, శ్రీకంచికామకోటి మఠం, శ్రీశృంగేరి శారదా పీఠం, శ్రీపరకాలస్వామి మఠం, శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ మఠం, తిరుమల కాశీమఠం, ఉడిపి మఠం, శ్రీవల్లభాచార్య మఠం ఇలా మరికొన్ని మఠా లున్నాయి. అయితే, వీటిలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకూడదు.
మఠాల భవనాలకు మరమ్మతులు కానీ, పునర్నిర్మాణం కానీ చేపట్టాలంటే ఆయా మతాల అధిపతులకు అనుమతి లేదు. టీటీడీ ఇంజినీరింగ్, పాలకమండలి బోర్డు నుండి అనుమతి తప్పనిసరి. అలా గే నిబంధనలకు విరుద్ధంగా అదనపు అం తస్తులు నిర్మించకూడదు కూడా. పైగా ఏవైనా మఠాలు తాము పొందిన స్థలాన్ని లేదా భవనాలను ఇతరులకు విక్రయించటం, లీజుకివ్వటం టీటీడీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇవ్వన్నీ తోసిరాజని పలు మఠాల ఆధ్వర్యంలోని సత్రాలు..
స్టార్ హోటళ్లకు మించి భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని గదులు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిటికి నిబంధనల్లో లేకున్నా వివాహాలకు అద్దెకిస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవా నికి మఠాల ఆధ్వర్యంలోని సత్రాల్లో నిత్యం వేదపఠనం, భజనలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు,ప్రసంగాలు, అన్నదానాలు నిర్వ హించాల్సి ఉంటుంది. కానీ ఏనాడూ అలాంటి వాటి జాడే లేదని పలువురు పేర్కొంటున్నారు.
అంతేకాదు, ఆయా మఠాధిపతులు తిరుమలలో ఆగమశాస్త్ర పరిరక్షణపై ప్రత్యే క దృష్టి సారించాలి. అవసరమైతే సలహాలు అందించాలి. కానీ.. అలాంటి సంద ర్భాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీవారి లడ్డూ కల్తీ అవుతున్నదని వచ్చిన ఆరోపణలపై తిరుమలలో ఆశ్రమాల ఆశ్రయం పొందుతున్న మఠాధిప తులు ఒక్కరు కూడా నోరువిప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వా నికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎక్కడ తమ ఆశ్రమాలను రద్దు చేస్తారోననే ఆందోళనతోనే తిరుమలలో ఎలాంటి పొరపాట్లు జరిగినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది.
సిఫార్సుల చికాకులు!
శ్రీవారి దర్శన భాగ్యం కలగడం అదృష్టమే. ఆ అదృష్టం కూడా సిఫారసు లేఖ లపై ఆధారపడడం సామాన్య భక్తకోటికి దురదృష్టంగా మారుతున్నది. దేశం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ క్రమంలో అందరికీ ఒకేసారి దర్శనం కల్పించడం అసాధ్యమనేది అందరికీ తెలిసిందే. అందుకు టీటీడీ ప్రణాళికా యు తంగా ముందుకు సాగుతున్నది. అయితే, ఆ ప్రణాళికలు కేవలం సామాన్య భక్తులకే వర్తిస్తాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
భగవంతుండి ముందు అందరూ సమానులే అన్నప్పుడు దర్శనంలో సా మాన్యులకు, పలుకుబడి కలిగిన వ్యక్తులకు వ్యత్యాసమెందుకు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులంటే.. వారికి ఎనో పనులు ఉంటాయి కాబటి.. వారికి దర్శనంలో ప్రాధాన్యం కల్పించవచ్చు.
కానీ, వారి తరఫున మరొకరికి దర్శనం కల్పించడం ఏమిటనేది అందరి వాదన. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 175 మంది ఎమ్మెల్యేలు, 58 మంది ఎమ్మెల్సీలు, 25 మంది ఎంపీలు ఇచ్చే సిఫా రసుల లేఖల మీద రోజుకు 1600 మం దికి పైగా వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే లేఖలతో వీఐపీ దర్శనాల సంఖ్య ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ సిఫారసు లేఖలను ఆగమశాస్త్రం అంగీకరిస్తుందా? అంటూ సామాన్య భక్తులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
ఆగమశాస్త్రం పాటించాలి..
ఇకనైనా తిరుమలలో ఆ దేవదేవుడి దర్శనం అందరికీ ఒకేలా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భగవంతుడి ముందు అందరూ సమానమనే సూక్తిని దృష్టిలో పెట్టుకుని.. తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. ఇందుకు ప్రభుత్వ పెద్ద గా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవాలి. తరచూ ఆగమశాస్త్రం, సనాతన ధర్మమంటూ వ్యాఖ్యలు చేసే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాన్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి.. భక్తులందరికీ ఒకే తరహా దర్శనం అందేందుకు ప్రభుత్వానికి తగు సూచనలు చేయా లి. అంతేకాకుండా మఠాల ఆధ్వర్యంలో సత్రాల నిర్వహణపై దృష్టి సారించాలి. ఉచితంగా గదులు అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించకూడదు.
అందుక వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆగమశాస్త్రం ప్రకారం పూజలు, ఆలయానికి చెందిన నిర్మాణాలు సాగుతున్నాయా? లేదా? అనేది కూడా ప్రభుత్వం పరిశీలించాలి. అందుకు పర్యవేక్షకులను నియమించాలి. శ్రీవారిపై భక్తుల్లో నమ్మకాన్ని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయ కుడు అందరినీ ఒకేలా చూస్తాడనే విశ్వాసాన్ని రెట్టింపు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం, పాలక మండలి తీసుకోవాలి.
: సీనియర్ జర్నలిస్ట్ సెల్ నం: 9491545699