కోతి.. కుక్క స్నేహబంధం

28-11-2026 | 11:30pm

సహజ శత్రుత్వాన్ని మరిపిస్తున్న అపురూప దృశ్యం

కురవిలో చూపరులను కట్టిపడేస్తున్న మూగజీవాల మైత్రి

మహబూబాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): సాధారణంగా కోతి, కుక్క(Monkey, dog) ఒకదానికొకటి ఎదురుపడితే వెంటపడటం, తరుముకోవడం, భయపెట్టుకోవడం చూస్తుంటాం. ఒకటి చెట్టెక్కి తప్పించుకుంటే.. మరొకటి కింద నుంచి మొరిగి హడావుడి చేయడం సహజం. కానీ అందుకు పూర్తి భిన్నమైన దృశ్యం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవిలో ఆవిష్కృతమవుతోంది. జాతి వైరాన్ని, సహజ శత్రుత్వాన్ని పక్కనపెట్టి ఓ శునకం కోతితో స్నేహబంధాన్ని(Friendship) పెనవేసుకోవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సాధారణంగా కోతులు, కుక్కల మధ్య కనిపించే వైరం ఇక్కడ మచ్చుకైనా కనిపించదు. ఒకదానికొకటి తోడుగా ఉంటూ, శునకం వీపునెక్కి తిరుగుతున్న దృశ్యం.. మూగజీవాల అనుబంధం చూపరులను అబ్బురపరుస్తోంది.  తనదైన చిలిపి చేష్టలతో కోతి సందడి చేస్తుంటే.. శునకం మాత్రం ఆప్యాయతతో దానికి తోడుగా ఉంటోంది. వాటి మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలు, ఆత్మీయతలు గుర్తుకొస్తున్నాయంటూ స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మాటలు లేవు.. మనసులో కల్మషం లేదు.. కులమతాలు, జాతి భేదాల ప్రసక్తే లేదు.. అయినా వాటి మధ్య విడదీయలేని అనుబంధం వెల్లివిరుస్తోంది. మనుషులు చిన్నచిన్న విషయాలకే విభేదాలతో దూరమవుతున్న తరుణంలో.. ఈ మూగజీవాలు మాత్రం సహజ వైరాన్ని సైతం మరిపిస్తూ స్నేహానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నాయి. అందుకే కురవిలో కోతి, కుక్క స్నేహబంధం ఇప్పుడు అందరి చూపులను ఆకర్షిస్తూ.. ప్రకృతి ఒడిలో ఆవిష్కృతమైన అపురూప మైత్రికి ప్రతీకగా నిలుస్తోంది. జాతులు వేరైనా.. మనసులు కలిస్తే స్నేహానికి హద్దులుండవని ఈ మూగజీవాలు మౌనంగానే చాటిచెబుతున్నాయి.

మరిన్ని వార్తలు