ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

28-11-2026 | 11:36pm

- కలెక్టర్ కుమార్ దీపక్

హాజీపూర్, (విజయక్రాంతి): వైద్య విద్యార్థులు(Medical students) ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు(Medical Services) అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో(Government Medical College) 6 రోజుల పాటు నిర్వహించిన ఎంపీరియా–2026 కళాశాల వార్షికోత్సవ వేడుకలకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ సాగర్ రావు(MLA Prem Sagar Rao), మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) మేయర్ ధర్ని మధుకర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ దేవాజి, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అశోక్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు చదువుతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సృజనాత్మక కార్యకలాపాలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. వైద్య వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, విద్యార్థి దశ నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని తెలిపారు.

2024లో వైద్య కళాశాల ఇండక్షన్ కార్యక్రమానికి వచ్చిన సమయంలో శాశ్వత భవనాలు, తరగతి గదులు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక ఏర్పాట్ల మధ్య విద్యార్థులు చదువుకున్నారని, ఈ విద్యా సంవత్సరం నాటికి శాశ్వత భవనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం 3 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గత 5, 6 నెలలలో 10 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి అవసరమైన వైద్య పరికరాల మరమ్మతులు, ఆధునిక పరికరాల కొనుగోలు చేపట్టడం జరిగిందని తెలిపారు. లాపరోస్కోపీ యూనిట్, ఎ బి జి తదితర ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఎంసిహెచ్‌లో హైరిస్క్ శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అవసరమైన ఫర్నిచర్, వైద్య పరికరాల ఏర్పాటు పూర్తయితే మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇవి పూర్తయితే ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనుసంధానంతో మంచిర్యాల జిల్లా వైద్య రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. 

మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ వైద్య సేవల విస్తరణకు అనుగుణంగా స్పెషలిస్ట్ వైద్యుల నియామకాలు చేపడుతున్నామని, ఖాళీలన్నీ భర్తీ అయ్యే వరకు నియామక ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇతర జిల్లాలకు వైద్య సేవలు అందించే రిఫరల్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. వైద్య విద్యార్థులు తమ ప్రాక్టికల్ శిక్షణ సమయంలో ఆసుపత్రికి వచ్చే వివిధ రకాల క్లిష్టమైన కేసులను పరిశీలించి, అనుభవజ్ఞులైన వైద్యుల వద్ద మెళకువలు నేర్చుకోవాలని సూచించారు.

అధిక సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందించే ఆసుపత్రులలో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్తులో వైద్యులుగా మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వైద్య వృత్తిలో చిన్న పొరపాటు కూడా రోగి ప్రాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తత, నైపుణ్యం, బాధ్యతాయుతమైన వైద్య సేవలు ఎంతో ముఖ్యమని తెలిపారు. కళాశాలలో విద్యార్థులే స్వయంగా క్రీడా మైదానాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని, క్రీడా సామగ్రి, మైదానాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఎంపీరియా–2026 వేడుకలలో భాగంగా ఈ నెల 23న నుంచి 25 వరకు రణక్షేత్ర క్రీడా పోటీలు, 26న మల్టీవర్స్ అండ్ ట్రెడిషనల్ డే, 27న ఫ్రెషర్స్ పార్టీ, రిథ్మిక్స్ సంగీత విభావరి, 28న ది ఫెస్ట్ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

మరిన్ని వార్తలు