అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలి

10-11-2026 | 10:59pm

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో చింతకుంట చెరువు, మోతె చెరువుల అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(MLA Dr Sanjay Kumar) సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతకుంట, మోతె చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించి 2025 డిసెంబర్‌లోనే టెండర్లు పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

చెరువుల సుందరీకరణ పనుల పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీనికి స్పందించిన కాంట్రాక్టర్ చింతకుంట చెరువు అభివృద్ధి పనులను రెండు రోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. చింతకుంట చెరువులోకి ఇస్లాంపూర్ ప్రాంతం నుంచి మురుగునీరు, ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు చెరువును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా మోతె చెరువు సుందరీకరణ పనుల కోసం దాదాపు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇందులో 85 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 15 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు