ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవం
షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల నవంబర్ 10 (విజయక్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య(MLA Kale Yadaiah) అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదని, ప్రతి పేద కుటుంబానికి భరోసా, గౌరవం, భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు.
మోడల్ హౌస్ ద్వారా ప్రభుత్వం నిర్మించే ఇళ్ల నమూనా, నాణ్యత, సౌకర్యాలను ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.