ఎస్బిఎం పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
డైరెక్టర్ సురేష్ బాబు
సూర్యాపేట, నవంబర్10 (విజయక్రాంతి): స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డైరెక్టర్ సురేష్ బాబు(Director Suresh Babu) అన్నారు. మంగళవారం జిల్లాలోని మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామ పంచాయతీని సందర్శించి, వివిధ ఎస్బిఎం (జి) కార్యక్రమాల అమలు తీరు, పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.హరిసింగ్ అధ్యక్షతన ఎంపీడీవోలు, ఎంపీఓలు, పీఆర్ ఏఈఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్లు వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణం, ఎస్ హెచ్ జి ఫెడరేషన్ భవనాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, పబ్లిక్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, ఎస్ఈఈపిసి సర్వే డేటా పరిశీలన ధృవీకరణ, డ్రెయిన్ ఎండ్ సోక్ పిట్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా వ్యర్థాల వేరు చేసే షెడ్ల నిర్మాణం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల గురించి సంబంధిత అధికారులు ఆయా కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
వాటి అమలులో ఉన్న లోపాలను గుర్తించి నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయడానికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, జడ్పీ సీఈవో శిరీష, డిపిఓ యాదగిరి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇంట్రా గ్రిడ్, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరు, ఎస్బిఎం, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.