అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
బెల్లంపల్లి: పట్టణ అభివృద్ధిలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamshi Krishna), బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కలిసి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న డివైడర్ నిర్మాణ పనులకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని 33వ వార్డులో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు జీవో 76 ద్వారా మంజూరైన ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు జీవో 76 ద్వారా ఇంటి పట్టాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి జీవో 76 ద్వారా ఇంటి పట్టాలు అందించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కల నెరవేరడం సంతోషకరమని తెలిపారు. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న జీవో 76 సమస్యను కార్మిక శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో తిరిగి పునరుద్ధరించడం జరిగిందన్నారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు తిరిగి ఇంటి పట్టాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో రూ.45 లక్షల నిధులతో డివైడర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి పనుల కోసం తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో సమన్వయంతో బెల్లంపల్లి అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రత్నం సుకుమారి, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.