జిల్లా అధికారులకు సమాచార హక్కు చట్టంపై శిక్షణ

28-11-2026 | 07:59pm

జగిత్యాల,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం –2005 అమలు, విధివిధానాలు, ప్రభుత్వ అధికారుల బాధ్యతలపై జగిత్యాల జిల్లాలో నవంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRDI) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్ లోని పాత కలెక్టరేట్ కార్యాలయ భవనంలో ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం, గది నంబర్ 214లో జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారి, ఇన్‌చార్జి ఆర్ టి ఎం వై తిరుపతి రావు నేతృత్వంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నవంబర్ 28న నిర్వహించిన శిక్షణలో సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులో అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన 19 రకాల రిజిస్టర్లు, ఆర్ టి ఐ దరఖాస్తుల స్వీకరణ, నమోదు, సమాచారం అందించే విధానం, ఇతర శాఖలకు దరఖాస్తుల బదిలీ, మొదటి అప్పీళ్ల పరిష్కారం, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారుల విధులు, బాధ్యతలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

ఈ అంశాలపై ఫ్యాకల్టీ జగిత్యాల సూపరింటెండెంట్ (ఆర్  & బి) సర్కిల్ జీ. కిషన్, ఏ సంతోష్ లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివిధ అంశాలను వివరించి శిక్షణ అందించారు. కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ, రిజిస్టర్ల సక్రమ నిర్వహణ, సమాచారాన్ని పారదర్శకంగా అందించడం, చట్టపరమైన నిబంధనలను పాటించడం వంటి అంశాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నాయబ్ తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు తదితర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు, ప్రజలకు నిర్ణీత సమయంలో సమాచారం అందించి సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు