సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిలిపివేయాలి

19-11-2026 | 05:09pm

24 డిమాండ్లపై సర్క్యులర్లు విడుదల చేయాలి

భూపాలపల్లి, నవంబర్ 19 (విజయ క్రాంతి): సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిలిపివేసి కార్మిక సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జనరల్‌ సెక్రటరీ(AITUC General Secretary) కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆగస్టు 27న కుదిరిన 24 డిమాండ్ల ఒప్పందంపై వెంటనే సర్క్యులర్లు విడుదల చేయాలని కోరారు. మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించి, అర్హులైన డిపెండెంట్లకు ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. భూగర్భ కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని, ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్, జి. సుధాకర్ రెడ్డి, ఎం.డి. ఆసిఫ్ పాషా, జి. శ్రీనివాస్, తాళ్ల పోషం, మల్లికార్జున్, గోవిందుల తిరుపతి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు