పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ప్రమాద బాదితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల ప్రోత్సాహం అందిస్తారని వెల్లడి
భూపాలపల్లి టౌన్, నవంబర్ 03 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి సత్వర వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్, రహవీర్ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీఎం రాహత్ పథకం కింద ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్యం అందుతుందని తెలిపారు.
జిల్లాలో కిరణ్ ఆసుపత్రి, యోధా ఆసుపత్రి, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, మహాదేవపూర్, చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రహవీర్ పథకం కింద ఒక్కో ప్రమాద ఘటనకు రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తారని తెలిపారు. అత్యవసర సహాయం కోసం వెంటనే 112 కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. ప్రమాద బాధితులను నిర్లక్ష్యం చేయకుండా మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో వైద్య సహాయం అందించాలని కోరారు.