సాగునీరు, కరెంటు కష్టాల్లో రైతన్నలు

10-11-2026 | 03:18pm
  1. కరువు మండలాల ఎంపికలో వివక్ష
  2. నిరుద్యోగుల హామీలు మరిచిన ప్రభుత్వం
  3. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడంలో నిర్లక్ష్యం 
  4. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్, నవంబర్ 10 ( విజయక్రాంతి ) : రైతులకు(Farmers) సాగునీరు, విద్యుత్(Irrigation, electricity) అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం చెందిందని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Ex MLA Gandra Venkataramana Reddy) అన్నారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో(BRS Party District Office) గండ్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గండ్ర భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులకు ప్రకృతి కారణమైనప్పటికి ప్రభుత్వ నిర్ణయాలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని విమర్శించారు. నాగారం గ్రామంలో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీరు కావాలని ప్రస్తుత ఎమ్మెల్యేను కోరితే కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

కరువు మండలాల ప్రకటనలో వివక్ష..

జిల్లాలో కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం అనుసరించిన విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతమైన పలిమెల, మహాముత్తారం, మహాదేవపూర్, కాటారం వంటి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గణపురం, మొగుళ్లపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.

చిన్న మండలమని గోరికొత్తపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన ప్రభుత్వం, మిగిలిన మండలాల రైతుల కష్టాలను ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. కరువు మండలంగా ప్రకటించడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు.

చలివాగు ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందించడం లేదని, ఇతర ప్రాంతాలకు నీటిని తరలిస్తున్న ప్రభుత్వం స్థానిక రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. దేవాదుల పథకం మోటార్లను తరచూ ఆన్, ఆఫ్ చేయడం వల్ల పైప్‌లైన్‌లకు లీకేజీలు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దేవాదుల పథకం మోటార్లు నిరంతరాయంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిర్వహణ పనులు చేపట్టి నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. దేవాదుల పథకం పూర్తిస్థాయిలో పనిచేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.

ఎన్నికల హామీలు..

ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారని కాని అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 

రిటైర్డ్ ఉద్యోగులకు..

రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల పిల్లల వివాహాలు, వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలను తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు కటకం జనార్దన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మహిళా విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు