అడుగడుగునా గురుభక్తి.. గడపగడపకు మంగళహారతులు
జుక్కల్, నవంబర్ 10 (విజయక్రాంతి) : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జుక్కల్ నియోజకవర్గంలోని(Jukkal Constituency) మద్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న జంగమ మహేశ్వరుల 40 రోజుల కార్తీక ప్రభాత ఫేరి భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతోంది. ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున ప్రారంభమవుతున్న ఈ ప్రభాత ఫేరి గల్లీ గల్లీకి భక్తి పరిమళాలను వెదజల్లుతోంది. వందల సంఖ్యలో భక్తులు(devotees) పాల్గొంటూ భజనలు, భక్తి గీతాలు, దైవ నామస్మరణతో ముందుకు సాగుతున్నారు.
ప్రజలు జంగమ మహేశ్వరులకు అందిస్తున్న అపూర్వ గౌరవం, గురుభక్తి జంగమ మహేశ్వరులు భజనలతో వీధుల్లోని ప్రతి ఇంటి ముంగిటకు చేరుకోగానే కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో(devotional) స్వాగతం పలుకుతున్నారు. కొన్ని కుటుంబాలు మంగళహారతులు సమర్పిస్తూ ఆహ్వానిస్తుండగా, మరికొన్ని కుటుంబాలు జంగమ మహేశ్వరులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానిస్తున్నాయి. పూలదండలు వేసి తమ గౌరవాభిమానాలను చాటుకుంటున్నారు. భక్తులు భక్తితో పాదదర్శనం చేసుకోవడం, కుటుంబ సభ్యులు పాదపూజలు చేయడం.
నీటితో పాదప్రక్షాళన చేయడం వంటి సంప్రదాయ ఆచారాలు ఈ ప్రభాత ఫేరిలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నాయి. ఇంటి గడప వద్దకు జంగమ మహేశ్వరులు విచ్చేసిన సమయంలో కుటుంబంలోని చిన్నా పెద్దా అందరూ కలిసి భజనల్లో పాల్గొనడం, మంగళహారతులు ఇవ్వడం, గురువుల ఆశీస్సులు పొందడం మద్నూర్ ప్రజల భక్తి భావానికి, సంప్రదాయాల పట్ల వారికున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోంది. మన భారతీయ సంస్కృతిలో గురువులకు విశిష్టమైన స్థానం ఉంది.
గురువులను గౌరవించడం, వారి ఆశీస్సులు పొందడం, భక్తి భావంతో సేవించడం వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలను మద్నూర్ ప్రజలు ఆచరణలో చూపిస్తున్నారు. జంగమ మహేశ్వరులకు ఇస్తున్న ఈ గౌరవం ద్వారా గురుభక్తి, వినయం, సేవాభావం, కుటుంబ ఐక్యత వంటి విలువలు సమాజానికి చాటిచెప్పబడుతున్నాయి. ఈ ప్రభాత ఫేరీలో పెద్దలతో పాటు యువత, మహిళలు, చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తెల్లవారుజామునే వీధులన్నీ భజనలతో మారుమోగుతుండగా, ప్రతి గడప వద్ద కనిపిస్తున్న భక్తి దృశ్యాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి.
పిల్లలు ప్రత్యక్షంగా ఈ సంప్రదాయాలను చూడటం, పాల్గొనడం ద్వారా మన సంస్కృతి, ఆచారాలు భావితరాలకు చేరుతున్నాయి. కార్తీక మాసం ముగిసే వరకు సుమారు 40 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రభాత ఫేరి మద్నూర్‌లో భక్తి, ఐక్యత, గురుభక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తోంది. ప్రతి ఇంటి గడప వద్ద లభిస్తున్న ఆత్మీయ స్వాగతం, ప్రతి వీధిలో వినిపిస్తున్న భజనలు, జంగమ మహేశ్వరులకు ప్రజలు అందిస్తున్న గౌరవం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూరుస్తున్నాయి.
భక్తి ఒక్కచోట చేరితే అది ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది… గురువులకు గౌరవం లభించిన చోట సంస్కృతి, సంప్రదాయాలు సజీవంగా నిలుస్తాయి. మద్నూర్ కార్తీక ప్రభాత ఫేరి అందిస్తున్న సందేశం ఇదే.