పౌర సరఫరాల శాఖ ఆకస్మిక దాడులు

05-11-2026 | 09:47pm

అక్రమంగా నిల్వ ఉంచిన 75 గ్యాస్ సిలిండర్లు సీజ్

బాధ్యులపై కఠిన చర్యలు

జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి రవీందర్ రాథోడ్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ ప్రాంతంలో అక్రమ గ్యాస్ సిలిండర్ల(Illegal Gas Cylinders) నిల్వలు, రీఫిల్లింగ్ వ్యవహారాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం పక్కా సమాచారంతో మండలంలోని తాడ్కోల్ గ్రామ శివారులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమంగా ఓ షెడ్డులో నిల్వ ఉంచిన 75 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి రవీందర్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తనిఖీల్లో 7 డొమెస్టిక్, 68 కమర్షియల్ సిలిండర్లు పట్టుబడ్డాయి.

వివిధ కంపెనీలకు చెందిన సిలిండర్లను ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డులో నిల్వ ఉంచినట్లు గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమ రీఫిల్లింగ్ జరుగుతున్నట్లు కూడా సమాచారం ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కొందరు అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్యాస్ ఏజెన్సీల పరిధిలో పనిచేస్తున్న కొందరి ప్రమేయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.సీజ్ చేసిన 75 సిలిండర్లను సంబంధిత ఏజెన్సీ గోదాం బాధ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను అరికడతామని అధికారులు హెచ్చరించారు.ఈ దాడుల్లో సివిల్ సప్లై డీటీలు బాలయ్య, అశోక్, జీపీఓలు శ్రీహర్ష, ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు