భూమి రీ సర్వేకు రైతులు సహకరించాలి
- జిల్లా కలెక్టర్ కె.హైమావతి
మిరుదొడ్డి,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం లింగుపల్లి, తొగుట మండలం చందాపూర్ గ్రామాల్లో జరుగుతున్న భూభారతి-రి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, భూ యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి-రి సర్వేకు రైతులు, యజమానులు సహకరించాలని సూచించారు. మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామ విస్తీర్ణం 556 ఎకరాలు, 186 ఎకరాలు సర్వే జరిగిందని, తొగుట మండలం చందాపూర్ గ్రామ విస్తీర్ణం 780 ఎకరాలకు 50 ఎకరాలు సర్వే పూర్తి జరిగిందని అధికారులు కలెక్టర్ కు వివరించారు.
గ్రామ సరిహద్దు, ప్రభుత్వ స్థలాలు, అబాది, చెరువులు, కుంటలు, నక్ష బాటలు చేశాకే పట్టా భూములు సర్వే చెయ్యాలని, పట్ట భూముల సర్వే కొరకు రెండు రోజులు ముందుగానే రైతులకు భూ యజమానులకు సమాచారం అందించాలని, స్థానికంగా లేని భూ యజమానులకు సైతం సమాచారం అందించాలని జీపీఓ, సర్వేయర్ లను ఆదేశించారు. సర్వే ప్రక్రియను రైతులు, భూ యజమానులు గమనించి ఏలాంటి సందేహాలున్న అధికారులకు తెలిపి నివృత్తి చేసుకోవాలని, సర్వే చేసిన వెంటనే భూమి యొక్క సర్వే వివరాలను తప్పనిసరిగా రైతులకు తెలియజేయాలని ఆదేశించారు.
ఓకే భూ యజమానికి ఒకే చోట పలు సర్వే నంబర్లలో భూమి ఉన్నట్లయితే వారికి భూ భారతి చట్టంలో ఆ యజమానికి ఒకే సర్వే నంబర్ కేటాయించడం జరుగుతుందన్నారు. భూమి కొనేటప్పుడు తప్పనిసరిగా సర్వే చేయించుకున్నాకే కొనుగోలు జరపాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న సాదా బైనామా అప్లికేషన్ పెండింగ్లో ఉంచకుండా డిస్పోజల్ చేయాలని తహసీల్దార్ లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆయా మండల తహసీల్దార్లు, గ్రామల సర్పంచులు ప్రజాప్రతినిధులు భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.