ఏజెంట్ల మోసానికి యువకుడు బలి

15-11-2026 | 06:17pm

మలేషియా జైల్లో యువకుడు...

నాలుగు నెలల నుంచి నరకయాతన...

నా భర్తను జైలు నుంచి విముక్తి చేయించాలి...

భార్య వేడుకోలు...

తాడ్వాయి,నవంబర్, 15( విజయక్రాంతి): కాలం కలిసి రాక,ఉన్న ఊరిలో ఉపాధి(Employment) లేక బ్రతుకుదెరువు కోసం బయట దేశాలకు వెళితే అక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. బయట దేశం వెళ్లి నాలుగు రూపాయలు సంపాదించుకుందామనుకున్న యువకులకు నరకయాతనే ఎదురవుతుంది. ఏజెంట్ల మోసాలకు(Agent fraud) బలైపోతున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఏజెంట్లు చేసిన మోసానికి బలైపోయాడు.ఆయన మలేషియా(Malaysia) దేశంలోని జైల్లో నాలుగు నెలల నుంచి  నరకయాతన పడుతున్నాడు.

వివరాల్లోకి వెళితే... కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తాడ్వాయి మండల(Tadvai Mandal) కేంద్రానికి చెందిన అజ్జేపల్లి సురేష్ (32) అనే యువకుడు గత జూన్ 4 నాడు మలేషియా దేశానికి వెళ్ళాడు. ఏజెంట్ వర్క్ వీసా అని నమ్మించి యువకుడిని మలేషియా దేశానికి పంపాడు.సదరు యువకుడికి ఏ వీసానో తెలియక మలేషియా వెళ్ళాడు. అక్కడ ఆయన ఏర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఇది వర్క్ వీసా కాదు టూరిస్ట్ వీసా అని తెలుసుకున్నాడు.

దీంతో నెలరోజుల పాటు పోలీసులకు దొరకకుండా దేశంలో అక్కడ ఇక్కడ తిరిగి తలదాచుకున్నాడు. జూలై 3న పోలీసులు ఆయనను పట్టుకొని జైల్లో బంధించారు.అప్పటినుంచి యువకుడు జైల్లోనే మగ్గుతున్నాడు.జైల్లో తాను నరకయాతన పడుతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.తనను ఎలాగైనా జైల్ నుంచి విడిపించాలని వేడుకొన్నారు.ఎన్ని డబ్బులు ఖర్చయినా తనను విముక్తి చేయాలని యువకుడు వేడుకుంటున్నారు. 

కామారెడ్డికి చెందిన గొల్ల శ్యామ్ రాజ్, మొడెగామకు చెందిన సంతోష్ అనే ఏజెంట్లకు ఆయన రూ.1.40 లక్షలు చెల్లించి మలేషియా వెళ్లారు.ఆయన మలేషియా దేశంలో పోలీసులకు పట్టుబడగానే ఆయనను పోలీసు నుంచి విడిపిస్తామని మళ్లీ ఏజెంట్లు నమ్మించి ఒక లక్ష పంపమని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఒక లక్ష ఏజెంట్ కు పంపించారు.

అయినా విడుదల కాలేదు.మళ్ళీ తిరిగి మరో రూ.70 వేలు పంపమని ఏజెంట్లు ఒత్తిడి చేయగా మళ్లీ భార్య మౌనిక,తల్లి రామవ్వ ఇద్దరు కలిసి తమకున్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.70 వేలు ఏజెంట్ కు పంపించారు.అయినా ఇప్పటికీ సురేష్ విడుదల కాలేదు.దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఆయన బయట దేశం వెళ్లడానికి,ఆయనను జైలు నుంచి విడిపించడం కోసం మొత్తం ఇప్పటివరకు రూ.3.10 లక్షలు ఖర్చు అయినట్లు వారు తెలిపారు.

ఎమ్మెల్యేను కలిశాం...

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావును కలిసి తమ గోడు వినిపించామని భార్య మౌనిక తెలిపారు.ఎమ్మెల్యే అక్కడ నుంచి విడిపిస్తానని తెలిపారని వివరించారు.కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అంతకుముందే మూడు నెలల క్రితం స్థానిక తాడ్వాయి ఎస్సై నరేష్ ను కలిసి తమ బాధను వివరించామని తెలిపారు.ఆయన సైతం స్పందించలేదని బోరుమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కరుణించి తన భర్తను మలేషియా జైలు నుంచి విడిపించాలని భార్య మౌనిక,తల్లి రామవ్వ లు వేడుకుంటున్నారు. జైల్లో ఉన్న సురేష్ కు ఇద్దరు చిన్న వయసు గల కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు