అండాల అక్రమ సేకరణలో ఒకరి అరెస్ట్
హైదరాబాద్: సంతాన సాఫల్య చికిత్సల పేరుతో మహిళల అండాలను అక్రమంగా సేకరిస్తున్నారనే ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన వ్యవహారంలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రతినిధి మూరెళ్ల నరసింహారావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేద మహిళలకు డబ్బుల ఆశ చూపించి వారి నుంచి అండాలను సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది (Illegal Egg Collection). ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బులు ఇస్తామని ఆశ చూపించి అండాలను సేకరించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో నరసింహారావు పాత్రపై విచారణ చేపట్టారు. ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలను సరఫరా చేసే విధానంపైనా ఆరా తీస్తున్నారు.
బేగంపేటలోని ఓ హాస్టల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను ఉంచి, వారి ద్వారా పలు సంతాన సాఫల్య కేంద్రాలకు అండాలను సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారం ఆధారంగా వైద్యాధికారులు హాస్టల్‌పై దాడులు నిర్వహించి 12 మంది మహిళలకు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే (Begumpet Hostel Raid). తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మహిళలను ఎలా నియమించారు? వారికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు? ఏయే ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలను సరఫరా చేశారు? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా నరసింహారావు అరెస్టుతో ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు (Police Investigation).మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అండాల సేకరణ సాగిందన్న ఆరోపణలు హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను పోలీసులు ఎలా బయటపెడతారన్నది ఆసక్తికరంగా మారింది.